KCR Khammam Sabha: రాజకీయాలంటే పరస్పర అవసరాలే ఉంటాయి.. ఇందులో ఎటువంటి గోప్యత లేదు. అప్పట్లో శాసనసభలో సిపిఎం, సిపిఐ పార్టీలను ఉద్దేశించి సూది, దబ్బుణంగా విమర్శించిన కేసీఆరే… తర్వాత మునుగోడు ఉప ఎన్నికల్లో ఆలింగనం చేసుకున్నాడు. ప్రగతి భవన్ లో విందు కూడా ఏర్పాటు చేశాడు. వారికి కూడా ఎటువంటి దిక్కుమొక్కు లేకపోవడంతో కెసిఆర్ పిలిచిందే పది వేలు అనుకొని.. శరణ శరణు మహా శరణు దొరా అనుకుంటూ మద్దతు ఇచ్చారు.. ఇంతా చేస్తే మునుగోడు లో దక్కింది 10,000 ఓట్ల మెజారిటీ.

భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత ఢిల్లీలో చక్రాలు తిప్పాలంటే కెసిఆర్ కు మరిన్ని పార్టీల అవసరం కనుక… కమ్యూనిస్టులను మరింత దగ్గర చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో వారికి సముచిత ప్రాధాన్యమిస్తున్నారు.. నమస్తే తెలంగాణ, టీ న్యూస్ లో విలువైన స్పేస్ ఇస్తున్నారు. దీనికి తోడు కమ్యూనిస్టులు కూడా తమ సిద్ధాంతాలను పూర్తిగా మర్చిపోయి గులాబీ సంకీర్తన చేస్తున్నారు.. వారి ధోరణి ఎలా ఉందంటే… ఎర్ర కండువా కప్పుకొని గులాబీ పాటలు పాడుతున్నట్టు ఉంది.. ముందుగానే మనం చెప్పినట్టు రాజకీయాల్లో అవసరాలు ఉంటాయి కనుక.. కమ్యూనిస్టులు తమ అవసరాలకు తగ్గట్టుగా నడుచుకుంటున్నారు.. ఇదే సమయంలో తాము విలువలకు కట్టుబడి ఉన్నామంటూ సాయుధ రైతాంగ ఉద్యమం నాటి మాటలు చెబుతున్నారు.
ఇక ఖమ్మం సభ తర్వాత తమకు కేసిఆర్ సీట్లు ఇస్తారని కమ్యూనిస్టులు ఆశపడుతున్నారు.. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలో తమ ప్రాబల్యం ఉన్నచోట సీట్లు కావాలని గతంలోనే తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లారు.. దీనికి అప్పట్లో ఆయననుంచి ఎటువంటి స్పందన రాలేదు.. మరోవైపు మొన్న ఖమ్మంలో పినరయ్ విజయన్ తో సభ నిర్వహించినప్పుడు తమ్మినేని వీరభద్రానికి బీఆర్ఎస్ నాయకులు సహకరించారు. ఇప్పుడు కూడా కమ్యూనిస్టు పార్టీ నాయకులు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు మద్దతు ఇస్తున్నారు.. రాజా, విజయన్ లాంటివారు హాజరవుతుండడంతో కమ్యూనిస్టులు కూడా ఈ సభకు వస్తున్నారు.. అయితే ఇదే సమయంలో ఆ నేతలతో ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సీట్లు అడిగించాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే అవకాశవాద రాజకీయాల్లో కమ్యూనిస్టుల కంటే పది ఆకులు ఎక్కువే చదివిన కేసీఆర్… వారి విన్నపాలను ఏ మేరకు అంగీకరిస్తారనేది తేలాల్సి ఉంది.

ఇక కమ్యూనిస్టు పార్టీలో అడిగే సీట్లలో భారత రాష్ట్ర సమితి నాయకులే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలుపొందారు.. పైగా చాలామంది కమ్యూనిస్టు నాయకులు భారత రాష్ట్ర సమితిలో చేరారు. మరి ఈ సమయంలో కమ్యూనిస్టు నాయకులు ఒకవేళ సీట్లు అడిగితే కేసీఆర్ ఇచ్చే పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కమ్యూనిస్టు పార్టీ నాయకులకు సీట్లు ఇస్తే అసలు వచ్చే ప్రమాదం ఉందని పేరు రాసేందుకు ఇష్టపడని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.. మరి ఈ నేపథ్యంలో కెసిఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే ఈ చర్చలు ఒక కొలిక్కి రాకముందే కొంతమంది కమ్యూనిస్టు నాయకులు మాకు సీట్లు వచ్చాయి, మీరు సహకరించాలని భారత రాష్ట్ర సమితి నాయకులను కోరుతుండడం గమనార్హం.