TDP Janasena BJP Manifesto: టిడిపి కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించారు. చంద్రబాబుతో పాటు పవన్ హాజరయ్యారు. బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ సిద్ధార్థ నాథ్ సింగ్ పాల్గొన్నారు. తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే మూడు పార్టీలు కూటమి కట్టాయని స్పష్టం చేశారు. జగన్ కొద్ది రోజుల కిందటే మేనిఫెస్టో ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ మేనిఫెస్టోలో ఆశించిన మెరుపులు లేవు. ఈ నేపథ్యంలో అందరి కళ్ళు కూటమి మేనిఫెస్టో పై ఉండేవి. ఈ తరుణంలో కీలక పథకాలు, ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తూ.. మూడు పార్టీల నేతలు ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించారు.
ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలను తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటికి తోడు జనసేన షణ్ముఖ వ్యూహం సైతం ప్రకటించింది. సూపర్ సిక్స్ పథకంలో భాగంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15000 రూపాయలు, ప్రతి ఏటా రైతుకు 20,000 ఆర్థిక సాయం, 19 నుంచి 59 సంవత్సరాల వయసున్న మహిళలకు ప్రతినెల 1500 రూపాయల నగదు, ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్లాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి ముందుగానే ప్రకటించారు.
అయితే తాజాగా మరికొన్ని పథకాలను జత చేస్తూ ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రతి ఇంటికి ఉచిత కులాయి కనెక్షన్, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూపాయి 50 పైసలకే అందించడం, పేద ప్రజలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పంపిణీ, మంజూరు చేసిన స్థలాల్లోనే ఇంటి నిర్మాణం, ఇసుక ఉచితం, అమరావతిని రాజధానిగా కొనసాగింపు, మత్స్యకారుల వేట విరామ సమయం సాయం 20 వేల రూపాయలకు పెంపు, 217 జీవో రద్దు, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, వృద్ధాప్య పింఛను నెలకు 4000, ఏప్రిల్ నుంచి వర్తింపు, దివ్యాంగులకు 6000 పింఛన్, బీసీలకు 50 ఏళ్లకు నెలకు 4000 పింఛన్, ఎన్డీఏ తెచ్చిన 10% ఈ బీసీ రిజర్వేషన్లు అమలు, చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు, బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో 1,50,000 కోట్ల రూపాయల ఖర్చు, ఉద్యోగుల సిపిఎస్ సమీక్షించి సరైన పరిష్కార మార్గం సూచన, వాలంటీర్లకు పదివేల గౌరవ వేతనం, కాపు సంక్షేమం కోసం 15 వేల కోట్ల రూపాయల నిధి, అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు ప్రత్యేక పథకాలు, రజకుల ధోబిఘాట్లకు 2 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25 వేల రూపాయల గౌరవ వేతనం, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10 శాతం రిజర్వేషన్లు, వడ్డెరలకు క్వారీల్లో 15% రిజర్వేషన్లు. రాయల్టీ, సీనరేజీల్లో మినహాయింపు. స్వర్ణకారుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్, చేనేత మరమగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మెగా డీఎస్సీ పై తొలి సంతకం, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల, పరిశ్రమలకు అనుగుణంగా విధానాలు, అందరికీ అందుబాటులో డిజిటల్ లైబ్రరీలు, క్రీడలకు ప్రోత్సాహం, ప్రతి మండలంలో జనరిక్ మందుల దుకాణాలు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుకలు, ఈడబ్ల్యూఎస్ నుంచి కాపులకు దామాషా పద్ధతిన రిజర్వేషన్లు, పిఆర్సి ప్రకటన, ఆడపిల్లల చదువు కోసం కలలకు రెక్కలు పధకం, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య భీమా, అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు, విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణం, జూనియర్ న్యాయవాదులకు పదివేల గౌరవభృతి.
అయితే వైసీపీ మేనిఫెస్టోలో.. కొద్దిపాటి చేర్పులు మార్పులు చేసి గతంలో ప్రకటించిన పథకాలనే జగన్ వెల్లడించారు. సామాన్య ప్రజలతో పాటు సొంత పార్టీ శ్రేణులకు సైతం ఈ మేనిఫెస్టో కొంచెం ఇరకాటంలో పెట్టింది. ఈ తరుణంలోకూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో ఆసక్తికర పథకాలు ఉన్నాయని.. అవి తప్పకుండా ప్రజలను తమ వైపు టర్న్ చేసేలా ఉన్నాయని మూడు పార్టీల శ్రేణులు నమ్ముతున్నాయి. దీనినే ఆ మూడు పార్టీలు ప్రచారస్త్రాలుగా మార్చనున్నాయి.