
Nayanthara: నయనతార అభిమానులకు షాక్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె యాక్టింగ్ మానేయాలని డిసైడ్ అయ్యారట. ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేసి సినిమాలు మానేయాలనుకుంటున్నారట. ఈ వార్త నయనతార అభిమానుల్లో గుబులు రేపుతోంది. నయనతార గత ఏడాది వివాహం చేసుకుంది. జూన్ 9న మహాబలిపురంలో దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లాడారు. 2015 నుండి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. ఏడేళ్లు డేటింగ్ చేసిన జంట ఎట్టకేలకు ఏడడుగులు వేశారు. పెళ్లి మాట ఎత్తకపోవడంతో ఒక దశలో విడిపోతారనే ప్రచారం జరిగింది. అయితే వివాహం చేసుకొని తమ ప్రేమ నిజమని నిరూపించారు.
పెళ్ళైన నాలుగు నెలలకే పేరెంట్స్ అయినట్లు ప్రకటించి వివాదానికి తెరలేపారు. సరోగసి పద్దతిలో ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది నయనతార. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న తమిళనాడు గవర్నమెంట్ విచారణ జరిపింది. మాకు ఐదేళ్ల క్రితమే పెళ్లైంది. సరోగసీ నిబంధనలు పాటించాము. సరోగేట్ మదర్ కూడా మా బంధువే అని ఆధారాలు సమర్పించారు. ఆ విధంగా సరోగసీ వివాదం నుండి ఆమె బయటపడ్డారు. ఈ పిల్లల కోసమే నయనతార షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట. సినిమాలకు విరామం ప్రకటించాలనుకుంటున్నారట.
తన ఇద్దరు కొడుకులు కొంచెం పెద్దవాళ్ళు అయ్యేవరకు వాళ్ళ ఆలనాపాలనా చూసుకోవాలనుకుంటున్నారట. పిల్లలను పెద్ద చేయడం కంటే పెద్ద బాధ్యత, కర్తవ్యం ఏమీ లేదని, కొన్నాళ్లు నటనకు ఫుల్ స్టాప్ పెట్టి కుటుంబ బాధ్యతలు నెరవేర్చాలని అనుకుంటున్నారట. నిజం చెప్పాలంటే కెరీర్లో అత్యున్నత స్థాయికి వెళ్లిన నయనతార ప్రత్యేకంగా సాధించాల్సినది ఏమీ లేదు. ఈ మేరకు నయనతార సినిమాలు వదిలేస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

ప్రస్తుతం నయనతార చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ జవాన్. షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. జూన్ నెలలో విడుదల కానుంది. చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. జవాన్ తో పాటు ఒక తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఇవి రెండే ఆమె చివరి చిత్రాలు కానున్నాయట. కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయకపోవడం వెనుక కారణం ఇదేనట. లేడీ సూపర్ స్టార్ గా నయనతార వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. అలాగే స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్స్లు దక్కించుకుంటున్నారు.