
TTD:తిరుమల తిరుపతి దేవస్థానం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే కొండపై ప్లాస్టిక్ నిషేధం పూర్తిగా అమలు చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుంది. ఈ క్రమంలో భక్తులకు అందించే లడ్డూల విషయంలో ప్రత్నామ్యాయ ఏర్పాటు ఆలోచన చేస్తుంది. తాటాకు బుట్టలను ప్రవేశ పెట్టాలనే యోచనను అమలు పరిచేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది.
తాటాకు బుట్టల వినియోగాన్ని అమల్లోకి తెస్తే ప్లాస్టిక్ వినియోగం తగ్గడంతో సంప్రదాయ వృత్తులను ప్రోత్సహించినట్లవుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు ప్రకృతి వ్యవసాయవేత్త జయరామ్ తాటాకులతో వివిధ సైజ్ ల్లో తయారు చేసిన బుట్టలను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. లడ్డు ప్రసాదాలను తీసుకెళ్లే భక్తులకు తాటాకు బుట్టలు ఎంతమేర ఉపయోగకరంగా ఉంటాయన్న దానిపై అధ్యయనం చేయనున్నట్లు
ఈవో తెలిపారు. అంతా ఓకే అయితే, త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.
మరోవైపు హస్తకళలను ప్రోత్సహించినట్లు ఉంటుందని టీటీడీ భావిస్తోంది. చేతివృత్తిదారులైన తాటాకు బుట్టలు తయారు చేసేవారికి చేతినిండా పనికల్పించినట్లవుతుంది. కాగా ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. వాటి స్థానంలో బయో’డీ’గ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆలయానికి అనుబంధంగా ఉన్న షాపుల్లోనూ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాలను పూర్తిగా నిషేధించింది. ఆలయాల్లో ప్రసాదాల పంపిణీలోనూ చిన్నచిన్న ప్లాస్టిక్ వినియోగాన్ని బ్యాన్ చేశారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బదులు గాజు సీసాలను వినియోగిస్తున్నారు.