Arjun vs Vishwak sen: యంగ్ హీరో విశ్వక్ సేన్ తన కొత్త ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. సీనియర్ నటుడు అర్జున్ దర్శకుడిగా ఉన్న ఈ మూవీ వివాదాలతో ఆగిపోయింది. ఈ క్రమంలో విశ్వక్ సేన్-అర్జున్ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అర్జున్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో విశ్వక్ సేన్ పై కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇవాళ్టి ఉదయం నుండి టాలీవుడ్ లో అర్జున్, విశ్వక్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. విశ్వక్ పదే పదే షూటింగ్ క్యాన్సిల్ చేయడంతో పాటు కాల్స్ కి స్పందించలేదని అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు.

విశ్వక్ సేన్ కోరినట్లు రెండు సార్లు షూటింగ్ షెడ్యూల్ క్యాన్సిల్ చేశాను. నవంబర్ 3న షెడ్యూల్ మొదలు కావాల్సి ఉంది. మళ్ళీ షెడ్యూల్ క్యాన్సిల్ చేయాలని విశ్వక్ నాకు మెసేజ్ పెట్టాడు. దీంతో వివరణ కోరేందుకు ఫోన్ చేస్తే స్పందించలేదు. నేను జీవితంలో ఎవరికీ అన్నిసార్లు కాల్ చేయలేదు. విశ్వక్ అన్ ప్రొఫెషనల్ యాక్టర్. అతనికి వృత్తి పట్ల నిబద్ధత లేదు. నాలా మరొకరు ఇబ్బంది పడకూడదు. అందుకే ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో అతనిపై కంప్లైంట్ చేశానని, అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్జున్ ఆరోపణల నేపథ్యంలో విశ్వక్ సేన్ స్పందించారు. నేను స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు సూచించిన మాట నిజమే. ప్రేక్షకులకు నచ్చుతాయన్న నా సలహాలు ఆయన తీసుకోవడం లేదు. సెట్స్ లో అందరూ ఆయన మాటే వినాలని అర్జున్ కోరుకుంటారు. ఇతరుల అభిప్రాయాలు, ఆలోచనలు పట్టించుకోరు. నా మాటకు సెట్స్ లో కొంచెం గౌరవం కూడా లేదు. ఆయనతో పని చేయలేకపోయాను. మనసు చంపుకొని నటించలేక ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాను. సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్స్ నిర్మాతల మండలికి పంపినట్లు విశ్వక్ తెలియజేశారు.
ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో నిర్మాతల ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. జూన్ నెలలో హైదరాబాద్ లో ఘనంగా ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ కి హాజరయ్యారు. హీరో హీరోయిన్స్ పై క్లాప్ కొట్టారు. ఈ చిత్ర హీరోయిన్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ కావడం విశేషం. ఈ చిత్రంతో ఐశ్వర్య తెలుగులో లాంచ్ కావాలని అనుకున్నారు. గతంలో రెండు తమిళ చిత్రాలు ఒక కన్నడ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించారు.