దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. 10,000 కంటే తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండగా మరణాల సంఖ్య కూడా అంతకంతకూ తగ్గుతుండటం గమనార్హం. మరోవైపు కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే ఈ వైరస్ కు పూర్తిస్థాయిలో చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒకటికి మించి వ్యాక్సిన్లు సక్సెస్ కావడంతో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.
అయితే తాజాగా కరోనా వైరస్ సోకకుండా మంత్ర కషాయం తీసుకున్న మంత్రికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. శ్రీలంకలోని కొలంబోలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. కొలంబో ఆరోగ్య శాఖ మంత్రి పవిత్ర కరోనా వైరస్ తో పోరాడేందుకు మహిమ గల మంత్ర కషాయం తీసుకోగా స్వయంగా ఆరోగ్య శాఖా మంత్రి కషాయం తీసుకోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. మంత్రి ఇలాంటి పిచ్చి పనులను ప్రోత్సహించడం ఏమిటని విమర్శలు వ్యక్తమయ్యాయి.
స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రి కషాయం తీసుకోవడంతో కొందరు ప్రభుత్వ అధికారులు కూడా కషాయాన్ని తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన కొంతమంది ప్రజలు కూడా కషాయం తీసుకోవడానికి ఆసక్తి చూపారు. డిసెంబర్ నెలలో మంత్రి కషాయం తీసుకోగా జనవరి నెలలో మంత్రికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మంత్రికి కరోనా నిర్ధారణ కావడంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
మ్యాజిక్ సిరప్ పని చేయలేదా..? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి తనను కలిసిన వాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి పవిత్ర అధికారులకు, ప్రజలకు సూచనలు చేశారు.