Gujarat: దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వలేదు.. ఈ సమామెతను తరచూ వింటుంటాం. చిన్నచిన్న పొరపాట్ల వరకు అయితే ఈ సామెతను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ, జీవితానికి సంబంధించిన విషయాల్లో అయితే దాని ఫలితం తీవ్రంగా ఉంటుంది. గుజరాత్‌లో ఓ వ్యక్తి జీవితంలో అదే జరిగింది. కోర్టు బెయిల్ ఇచ్చినా.. జైలు అధికారులు చూసుకోకపోవడంతో సదరు వ్యక్తి మూడేళ్లు జైల్లోనే మగ్గాల్సి వచ్చింది.
కోర్టు నుంచి మెయిల్..
టెక్నాలజీ పెరుగుదల అన్ని పనులను సులభతం చేస్తుంది. దీంతో టెక్నాలజీని విచ్చలవిడిగా వాడేస్తున్నాం. కొంతమంది అయితే మంచి చెడు ఆలోచించకుండానే టెన్నాలజీని వాడేస్తున్నారు. దుష్పరిణామాలు వచ్చిన తర్వాత బాధపడుతున్నారు. మరికొందరు కాలక్షేపానికి టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. అయితే కోర్టు కేసులు ఎదుర్కొంటున్న వాద, ప్రతివాదులతోపాటు న్యాయవాదులకే సేవలు సులభతరం చేసేందుకే కోర్టుల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నారు. అదే ఓ నిందితుడి కొంప ముంచింది. గుజరాత్ జైలు అధికారులు ఈ–మెయిల్‌లో వచ్చిన బెయిల్ ఆర్డర్ చూడకపోవడంతో ఓ వ్యక్తి 3 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఈ విషయం వెలుగు చూడడంతో గుజరాత్ హైకోర్టు సీరియస్ అయ్యింది. అతడికి పరిహారం ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించింది.
హత్యకేసులో జైలుకు..
గుజరాత్‌కు చెందిన 27 ఏళ్ల చందంజీ ఠాకోర్ అనే వ్యక్తి ఓ హత్య కేసులో గుజరాత్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అతనికి 2020, సెప్టెంబర్ 29న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఆర్డర్ కాపీని కోర్టు అధికారులు జైలు అధికారులకు ఈ–మెయిల్ చేశారు. మూడేళ్లు కావస్తున్నా జైలు అధికారులు ఆ మెయిల్ ఓపెన్ చేసి చూడలేదు.
మళ్లీ దరఖాస్తు చేయడంతో వెలుగులోకి..
బెయిల్ ఇచ్చిన విషయం చందంజీ ఠాకోర్‌కు కూడా తెలియదు. దీంతో తాజాగా ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బెయిల్ ఆర్డర్‌ను జైలు అధికారులు తెరవకపోవడంపై గుజరాత్ హైకోర్టు సీరియస్ అయ్యింది.
కోవిడ్ కారణంగా చూసుకోలేదని..
కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ కేసులో అవసరమైన చర్యలు తీసుకోలేకపోయామని జైలు అధికారులు కోర్టుకు చెప్పారు. అందువల్ల మెయిల్‌తో కూడిన అటాచ్ మెంట్ తెరవలేకపోయినట్లు వివరణ ఇచ్చారు. అధికారుల వివరణను తీవ్ర పరిగణనలోకి తీసుకున్న గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరైన ఖైదీల వివరాలను సేకరించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలను ఆదేశించింది. చందంజీ ఠాకోర్ అదనంగా మూడేళ్లు జైలు శిక్షను అనుభవించడానికి కారణమవ్వడంతో అతనికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని.. 14 రోజుల వ్యవధిలో ఆ మొత్తం చెల్లించాలని ఆదేశించింది.