Visakhapatnam: చార్జీ డబ్బులు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. కదులుతున్న బస్సులో నుంచి తోసేశారు. ఈ ఘటన ఈనెల 3న ఆంధ్రప్రదేశ్‌లోని లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై జరిగింది. విశాఖపట్నం మధురవాడ ప్రాంతానికి చెందిన గేదెల భరత్‌కుమార్(27) మృతిచెందగా, మిస్టరీని పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు.
బస్ చార్జీ కోసం గొడవ..
మధురవాడకు చెందిన భరత్‌కుమార్ ఈ నెల 3న అర్ధరాత్రి విశాఖపట్నం నుంచి తన స్నేహితులతో కారులో శ్రీకాకుళం వచ్చాడు. అనంతరం పనుంది ఇంటికి తిరిగి వెళ్లాలని తన స్నేహితులతో చెప్పడంతో వారు తెల్లవారుజామున భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో నవభారత్ కూడలి వద్ద ఎక్కించారు. అనంతరం భరత్‌కుమార్‌ను బస్సు క్లీనర్ బొమ్మాళి అప్పన్న, డ్రైవర్ రామకృష్ణ చార్జీ డబ్బులు రూ.200 ఇవ్వమని అడిగారు. తన స్నేహితులు ఫోన్‌పే చేస్తారని భరత్‌కుమార్ చెప్పాడు. ఎంతసేపటికి డబ్బులు రాకపోడంతో మరోసారి అడిగారు. స్నేహితుల ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని విశాఖ వెళ్లిన తరువాత ఇస్తానని చెప్పడంతో వారి మధ్య గొడవ మొదలైంది.
బస్సులో నుంచి తోసేశారు..
బుడుమూరు సమీపంలోకి వచ్చే సరికి గొడవ పెద్దదైంది. ఈ క్రమంలో భరత్‌ను వెళ్తున్న బస్సులో నుంచి బయటకు తోసేశారు. దీంతో డివైడర్ మధ్యలో ఉన్న క్రాస్‌బేరియర్‌ను ఢీకొని తలకు బలమైన గాయమైంది. కాలు విరిగిపోయింది. తీవ్ర గాయాలతో ఉన్న భరత్‌ను హైవే పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. నవభారత్ కూడలి వద్ద 3.45కు బస్సుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ దొరకడంతో మూడు రోజులపాటు హైవేపై దర్యాప్తు చేపట్టారు.
నిందితులను పట్టించి సీసీ ఫుటేజీ..
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచాణ వేగవంతం చేశారు. మడపాం టోల్‌ప్లాజా తదితర చోట్ల ఉన్న అన్నీ సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు తనిఖీ చేశారు. వాటి ఆధారంతో ప్రైవేటు బస్సు డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయడంతో నేరం అంగీకరించారు. టికెట్ చార్జీ విషయంలో గొడవ తలెత్తిందని, ఈ క్రమంలో బస్సులో నుంచి తోసేశామని తెలిపారు. అయితే చనిపోతాడని ఊహించలేదని పేర్కొన్నారు.
క్షణికావేశంలో డ్రైవర్, క్లీనర్ చేసిన పొరపాటు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. విశాఖపట్నం వరకు ఓపిక పట్టి ఉంటే డబ్బులు చెల్లించడంతోపాటు భరత్ బతికేవాడు. డ్రైవర్, క్లీనర్ జైలుకు వెళ్లేవారు కాదు. ఏదైనా ఇబ్బంది ఉంటే అదనపు చార్జీ వసూలు చేసినా పరిస్థితి మరోలా ఉండేది.