Television Channels- News Papers: చిన్న చేపను పెద్ద చేప మింగుతుంది. పెద్ద చేపను మరొకటి మింగుతుంది. అది సృష్టి ధర్మం. ఒకటి పుడితే మరొకటి చావాలి. లేదా చచ్చినట్టు బతకాలి. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకూ అంటే.. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్దీ కొత్త ఒక చింత, పాత ఒక రోత అవుతోంది. ఒకప్పుడు మ్యాగ జైన్లు ఉండేవి. న్యూస్ పేపర్ లో ఫీచర్ పేజీలు తీసుకొచ్చారు. దెబ్బకి ఆ మ్యాగ జైన్లు మూత పడ్డాయి. ఇప్పుడు స్వాతి, నవ్య లాంటివి కనిపిస్తున్నాయా అసలు? ఒకప్పుడు వాటిని చదివేందుకు ఎంత పోటీ ఉండేదని? ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఒకప్పుడు దూరదర్శన్ లో వార్తలే దిక్కు. సమాచార విప్లవ దెబ్బకు అన్నీ మారి పోయాయి.

ముఖ్యంగా స్మార్ట్ యుగంలో ప్రతీది మన కాళ్ల దగ్గరికే వస్తున్నది. కోవిడ్ తర్వాత న్యూస్ పేపర్లు నేల చూపులు చూస్తున్నాయి. కొనే దిక్కు లేదు. పేపర్లు, వాటి యాజమాన్యాల రాజకీయ రంగులు తెలుసు కాబట్టి జనం హే ఫో అంటున్నారు. ఇక ఆ న్యూస్ ఛానెళ్ల దరిద్రం మరీ చెండాలం. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలో ఓ మూడు నాలుగు మినహా మిగతా ఛానెళ్ల కు పెద్దగా రెవెన్యూ ఉండదు. వాటి దిక్కు మాలిన కవరేజీ లు, జుగుప్స రేకెత్తించే డిబేట్లు పాత్రికేయాన్ని సర్వం భ్రష్టు పట్టించాయి. నాయకుల డప్పు కొట్టడం, వారి పాదాల ప్రాపకం కోసం పని చేయడం అసలు ఇప్పుడు పాత్రికేయాన్ని ఎవడైనా గౌరవిస్తున్నాడా? సరే ఇదంతా ఓ చరిత్ర.. న్యూస్ పేపర్లు, న్యూస్ చానెళ్ళ మాదిరే ఇప్పుడు వినోద ఛానెళ్లు కూడా మట్టి గొట్టుకుపోతున్నాయి కాబట్టి. అసలు ఆ ఛానెళ్ల అసలు దరిద్రం సీరియళ్లు. వాటితోనే కదా రామోజీరావు కోట్లు ముద్రించుకున్నది. సుమన్ వెలుగులోకి వచ్చింది. ప్రభాకర్ తో అంట కాగి రామోజీరావు ను నిలదీసింది. ఇక సీరియళ్ళ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అదో దిక్కుమాలిన క్రియేటివిటీ. రాబోయే రోజుల్లో భారీగా రెవెన్యూ వస్తుందని ఛానెళ్లు మస్తు హుషారు లెక్కల్లో ఉన్నాయి. కానీ దిమ్మ తిరిగే వాస్తవం ఏంటంటే ఓటీటీ దెబ్బకు ఛానెళ్ల రేటింగ్స్ దెబ్బకు నేలకు పడిపోతున్నాయి. మా టీవి, జీ టీవీ, ఈ టీవి, జెమినీ టీవీ.. ఏవీ అతీతం కాదు.
-బార్క్ రేటింగ్ తో బట్ట బయలు
బార్క్… అధికారికంగానే టీవీలను వీక్షించే వారి సంఖ్యను, సమయాన్ని రేటింగ్స్ ను ఈ సంస్థ ప్రతి వారం విడుదల చేస్తూ ఉంటుంది. అది ఎంతవరకు శాస్త్రీయమో పక్కన పెడితే.. 2020( ఆ ఏడాదిలో 39వ వారం రేటింగ్స్)తో పోలిస్తే 2022(ఈ ఏడాది 45వ వారం రేటింగ్స్) నాటికి 29 శాతం రేటింగ్స్ డౌన్ అయింది. ఇదీ తెలుగులోనే. అన్నట్టు మిగతా భాషలో గొప్పగా లేదు. ఈటీవి, జెమినీ, మా టీవి, జీ టీవీ కలిసి 29 శాతం టీఆర్పీ కోల్పోయాయి. ఇక ఈటీవి 42 శాతం, జెమినీ 46 శాతం టీఆర్పీ కోల్పోయాయి. అంటే డేంజర్ బెల్స్ మోగుగున్నట్టే లెక్క.
-పేపర్లు కూడా డౌన్
ఛానెళ్ల మాదిరే పేపర్లు కూడా తమ సర్క్యులేషన్ ను ఎంతో వేగంగా కోల్పోతున్నాయి. ఈనాడు 26 శాతం డౌన్ అయింది. ఆంధ్రజ్యోతి కూడా అంతే. ఇక్కడ సాక్షి మాత్రం తక్కువ పతనంలో ఉంది. ఇందుకు కారణం ఓటీటీ. కోవిడ్ రోజుల్లో నేరుగా మన ఇంటికే వచ్చింది. గృహిణులు కూడా సీరియల్స్ ను టీవీకి అతుక్కుని చూడటం లేదు. తాపీగా యాప్ ఓపెన్ చేసి ఖాళీ సమయాల్లో చూస్తున్నారు. జీ సీరియల్స్ కు జీ5, మా టీవి సీరియల్స్ కి డిస్నీ ప్లస్ +హాట్ స్టార్, ఈటీవి సీరియల్స్ కు ఈటీవి విన్, జెమినీ సీరియల్స్ కు సన్ నెక్స్ట్. వీటికి తోడు ఆహా. ఈ ఓటీటీల దెబ్బకు టీవీ ప్రోగ్రామ్స్ అన్ని దయనీయమైన రేటింగ్స్ తో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన పాడుతా తీయగా అనే ప్రోగ్రాం ఇప్పుడు సాధిస్తున్న రేటింగ్ 1.5.. అలీ తో సరదాగా అనే ప్రోగ్రాం రేటింగ్ 1.39.. జీ తెలుగులో పాపులర్ సీరియల్ త్రినయని 7.5 దాటడం లేదు. మా టీవి వంటలక్క సీరియల్ కార్తీకదీపం 11 దగ్గరే కొట్టుకుంటుంది. ఇక గృహలక్ష్మి, ముద్దమందారం, మాతృదేవోభవ వంటి సీరియల్స్ అయితే ఆరు దగ్గరే ఆగిపోతున్నాయి.

ఫైనల్ గా చెప్పేది ఏంటంటే.. సినిమా థియేటర్ల మాదిరే.. వినోద చానల్స్ పై ప్రేక్షకులకు విరక్తి మొదలైంది. ఆ పనికిమాలిన క్రియేటివిటీ చూసి చిరాకు వచ్చింది. ఇప్పుడు ప్రేక్షకుల్ని కాస్తో కూస్తో ఆకట్టుకుంటున్నాయంటే అవి ఓటీటీలు మాత్రమే. తక్కువలో వచ్చే బ్రాడ్ బ్యాండ్ నెట్, పైగా వార్షిక సబ్స్క్రైబ్ ఫీజు కూడా తక్కువే. ఇంకేముంది కావలసినంత కంటెంట్. పైగా నచ్చిన భాషలో.. అందుచేత న్యూస్ పేపర్లు, న్యూస్ ఛానళ్లు, వినోద ఛానళ్ళు.. తీరు మార్చకపోతే ఎండిపోతాయి. అది కూడా అతి త్వరలో.
Also Read:Pawan Kalyan:అన్నయ్య చిరంజీవికి అవార్డు .. పవన్ కళ్యాణ్ ఎమోషనల్
[…] Also Read: Television Channels- News Papers: వినోద చానెళ్లు, పత్రికలక… […]