Viral Video: ఉద్యోగం పురుష లక్షణం అని ఎవరన్నారో గాని.. ఏ సందర్భంలో అన్నారో గానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం ఉంటేనే మగ పిల్లలకు పెళ్లిళ్ళవుతున్నాయి. అందులోనూ సర్కారీ నౌకరి ఉన్న వాళ్లకు త్వరగా వివాహాలవుతున్నాయి. సాధారణంగా పెళ్లంటే ఈడు జోడు చూస్తారు. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు పరిశీలిస్తారు. ఆ తర్వాతే అసలు కార్యం మొదలుపెడతారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉన్న యువకుడి విషయంలో మాత్రం ఇవేవీ చూడటం లేదు. ఎందుకంటే మన సమాజంలో గవర్నమెంట్ జాబ్ అంటే సెక్యూరిటీ ఉంటుంది అనే ఒక భావన నిండిపోవడమే ఇందుకు కారణం. అలాంటి గవర్నమెంట్ జాబ్ ఉన్న యువకులను చేసుకునేందుకు కూడా అమ్మాయిలు పోటీ పడుతున్నారు. అతగాడు ఎలా ఉన్నా పట్టించుకోవడం లేదు. తెలుపు నలుపులను అసలు ఖాతరు చేయడం లేదు. ఇలాంటి కోవకు చెందిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది.
నల్లగా ఉంటే ఏంటి?
ఇన్ స్టా గ్రామ్ లో కోడి ముందా గుడ్డు ముందా అనే ఒక ఐడి నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. అందులో ఓ వివాహ రిసెప్షన్ కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. అందులో బట్టతలతో ముందుకు వచ్చిన పొట్టతో ఓ వ్యక్తి ఉన్నాడు. అతని పక్కనే చందమామ లాంటి ఒక అమ్మాయి ఉంది. అతగాడు అలా ఉన్నప్పటికీ ఆ అమ్మాయి ఇష్టపడేందుకు ప్రధాన కారణం గవర్నమెంట్ ఉద్యోగమే. ఆ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఉండడంతో రెండో మాటకు తావు లేకుండా ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. ఈతంగాన్ని చూసిన కొంతమంది వీడియో తీశారు. ఆ వీడియో అలా చెక్కర్లు కొట్టుకుంటూ సోషల్ మీడియాను చేరింది. ఇంకేముంది ట్రోల్స్ ప్రారంభమయ్యాయి.
మాకు పెళ్లి అవ్వడం లేదు భయ్యా
ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. మాకు 35 సంవత్సరాలు వచ్చినప్పటికీ పెళ్లిళ్లు కావడం లేదు. అమ్మాయిలు ఏదో ఒక వంక చెప్పి మమ్మల్ని తిరస్కరిస్తున్నారు. నువ్వు రంగు లేవు. నీ నెత్తి మీద నాలుగు వెంట్రుకలు కూడా లేవు. అయినా కూడా చక్కని చుక్క నీ సతీమణి అయ్యింది.. ప్రభుత్వ ఉద్యోగం అంటే అట్లుంటది మరి. మేము చేసే ప్రైవేట్ ఉద్యోగాలు అంతంత మాత్రం గానే ఉపాధినిస్తున్నాయి. అందుకే అమ్మాయిలు మమ్మల్ని ఒప్పుకోవడం లేదు. మాకు పెళ్లిళ్లు కావడం లేదు భయ్యా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటికే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. 1976 మంది నెటిజన్లు ఈ వీడియో మీద కామెంట్లు చేశారు.1,16,000 మంది లైక్ చేశారు.