
ఈ మధ్య కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కొత్త నిర్ణయాలను అమలు చేస్తూ వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి. దేశంలోని పలు బ్యాంకులు వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులను అందిస్తున్నాయి. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలోని చాలామంది ప్రజల్లో వైరస్ పై తీవ్ర భయాందోళన నెలకొంది. బ్యాంక్ కు వెళ్లి డబ్బులు తీసుకోవాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
దీంతో మోదీ సర్కార్ వినియోగదారులకు డోర్ స్టెప్ సర్వీసులను అందించడం ద్వారా ప్రయోజనం కల్పించాలని భావిస్తోంది. ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం డోర్ స్టెప్ సర్వీసులను అందిస్తూ వినియోగదారులను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ సేవల వల్ల సాధారణ ఖాతాదారులతో పోల్చి చూస్తే వికలాంగులు, సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం కలుగుతుంది.
బ్యాంక్ ఖాతాదారులు వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా రిజిష్టర్ చేసుకుని ఈ ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. ఎస్ఎంఎస్ లేదా కాల్ సెంటర్ కు కాల్ చేయడం ద్వారా కూడా డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులను పొందవచ్చు. ఈ నెల ఒకటో తేదీ నుంచి కస్టమర్లకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. డోర్ స్టెప్ సర్వీసుల ద్వారా ఫైనాన్షియల్ సర్వీసులతో పాటు నాన్ ఫైనాన్షియల్ సర్వీసులను కూడా సులువుగా పొందవచ్చు.
క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్ డ్రా, కొత్త చెక్ బుక్, అకౌంట్ స్టేట్ మెంట్, డిమాండ్ డ్రాఫ్ట్ లాంటి సేవలను సులువుగా పొందవచ్చు. అయితే డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు ఉచితం కాదు. బ్యాంకును బట్టి ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. ఈ సర్వీసులకు ఆంధ్రాబ్యాంక్ 75 రూపాయలు, ఎస్బీఐ 100 రూపాయలు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 200 రూపాయలు వసూలు చేస్తున్నాయి.