https://oktelugu.com/

Nagaland: రాకాసి కొండ చరియలు… చూస్తుండగానే ఈ కారును నుజ్జు నుజ్జు చేశాయి

ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లో నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల గత కొన్ని రోజులుగా విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. పూర్తిగా కొండ ప్రాంతమైన నాగాలాండ్ లో వర్షాలు కురిస్తే కొండ చరియలు విరిగి పడటం సర్వసాధారణం.

Written By:
  • Rocky
  • , Updated On : July 5, 2023 / 10:00 AM IST

    Nagaland

    Follow us on

    Nagaland: ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. ఈ రూపంలో మనల్ని కబళి స్తుందో అంతుపట్టదు.. అందుకే మన పెద్దలు జీవితం క్షణభంగురం అన్నారు.. ఈ నానుడిని నిజం చేసేలా ఓ సంఘటన నాగాలాండ్ రాష్ట్రంలో జరిగింది. చూస్తుండగానే ఒక పెద్ద బండ రాళ్ళు దొర్లకుంటు దొర్లుకుంటూ వచ్చి ఒక కారును ధ్వంసం చేశాయి. ఆ బండరాళ్ల తాకిడికి కారు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది. అటువైపుగా వెళ్లేవారు ఈ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

    ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లో నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల గత కొన్ని రోజులుగా విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. పూర్తిగా కొండ ప్రాంతమైన నాగాలాండ్ లో వర్షాలు కురిస్తే కొండ చరియలు విరిగి పడటం సర్వసాధారణం. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రాకపోకలు సాగించాలి కాబట్టి ప్రజలు ఆ మార్గాల మీదుగానే వెళ్తున్నారు.. ఇక మంగళవారం కూడా నాగాలాండ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షం కురిసింది. ఈ వర్షం తాకిడికి కొండల మీద ఉన్న మట్టి కరిగిపోయి కొండ చరియలు విరిగి పడటం ప్రారంభమైంది. అవి అలా అలా దొర్లుకుంటూ వచ్చి ఆగి ఉన్న కారు మీద పడ్డాయి. ఆ రాళ్ల తాకిడికి కారు మొత్తం ధ్వంసం అయిపోయింది.. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం చెందారు. అస్సాం లోని దిమాపూర్, నాగాలాండ్ పరిధిలోని కొహిమా మధ్య చుమౌకెడిమా జిల్లాలోని 29వ జాతీయ రహదారి పై ఈ దుర్ఘటన జరిగింది. భారీ వర్షాల మధ్య సాయంత్రం జరిగిన ఈ సంఘటనలో మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరో రెండు కార్లు కూడా ధ్వంసం అయ్యాయి. అయితే ఆ మార్గంలో వెనుక వైపు ఉన్న ఒక కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు తన ఫోన్ ద్వారా ఈ ప్రమాదానికి సంబంధించి వీడియో తీశాడు. కారు డాష్ బోర్డు నుంచి తీసినప్పటికీ ఆ వీడియో స్పష్టంగా కనిపిస్తోంది.

    ఇక ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికి అక్కడే దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతూ స్థానిక ఆసుపత్రిలో కన్నుమూశారు. రాళ్లు ఢీకొట్టడం వల్ల కారు పూర్తిగా ధ్వంసం కావడంతో ఒక ప్రయాణికుడు అందులోనే ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. అయితే అతడిని రక్షించేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తున్నట్టు జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. ఇక ఈ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని “పోకలా పహార్” అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో కొండ చరియలు వీరిగి పడటం సర్వసాధారణం. గతంలో ఈ ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. అయితే ఈ మార్గం తప్ప రాకపోకలకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో గత్యంతరం లేక ప్రయాణికులు దీని మీదు గానే వెళ్తున్నారు. ఇక ఈ దుర్ఘటనకు సంబంధించి నాగాలాండ్ ముఖ్యమంత్రి నిఫియూ రియో ట్వీట్ ద్వారా మృతులకు సంతాపం తెలిపారు.” దిమా పూర్, కోహిమా మధ్య సాయంత్రం ఐదు గంటల సమయంలో జాతీయ రహదారిపై కొండ చరియ విరిగి పడింది. ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.. ఈ ప్రదేశాన్ని పాకలా పహార్ అని పిలుస్తారు. ఇది కొండలకు ప్రసిద్ధి” అని ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు క్షతగాత్రులకు అత్యవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని నాగాలాండ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కొండ చరియల ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం తోడ్పాటుతో రక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.