Garlic Price: మనదేశంలో ప్రభుత్వాలను కూల్చిన ఘనత టమాట, ఉల్లిగడ్డలది.. ఎందుకంటే ఇవి లేనిదే ఏ ఇంట్లో కూర ఉడకదు. ఆగర్భ శ్రీమంతుల నుంచి సామాన్యుల వరకు వారంలో కనీసం ఐదు రోజులైనా వంటల్లో ఇవి ఉండాల్సిందే. ఉల్లి తీర్చిన కష్టాలు తల్లి కూడా తీర్చలేదు అనే సామెత పుట్టింది. ఇక టమాట వేయకుండా ఏ కూర ఉడకదు. ఏ కూర వండే పరిస్థితి ఉండదు. వీటి ధరలు పెరిగినప్పుడు దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు అలర్ట్ అయిపోతాయి. గత ఏడాది వ్యవసాయ సీజన్ ప్రారంభంలో కిలో టమాటా ధర దాదాపు 200 దాకా పలికింది. అప్పట్లో చేలల్లో ఉన్న టమాటా పంటను దొంగలు ఎత్తుకెళ్లకుండా రైతులు ప్రత్యేకంగా సెక్యూరిటీతో కాపలా ఉంచారు. అప్పట్లో ఈ తరహా వార్తలు సోషల్ మీడియాను హోరెత్తించాయి. కొత్త పంట చేతికి వచ్చిన తర్వాత టమాట, ఉల్లిగడ్డ ధర తగ్గడం ప్రారంభమైంది.
ప్రస్తుతం వెల్లుల్లి ధర విపరీతంగా పెరుగుతోంది. బహిరంగ మార్కెట్లో కిలో ధర 500 వరకు పలుకుతోంది. దీంతో వెల్లుల్లి ని కొనుగోలు చేయాలంటేనే వినియోగదారులు జంకుతున్నారు.. అంత ధర పెట్టి వెల్లుల్లిని కొనుగోలు చేయలేని వారు కూరల్లో, ఇతర వంటల్లో వేయడం మానేస్తున్నారు. వాస్తవానికి అల్లం, వెల్లుల్లి కలిపి నూరితేనే అల్లం పేస్ట్ తయారవుతుంది. దానిని వేస్తేనే కూరకు రుచి వస్తుంది. కానీ వెల్లుల్లి ధర పెరుగుతున్న నేపథ్యంలో అల్లం వాడకాన్ని చాలామంది విరమించుకుంటున్నారు. మన దేశంలో పండే వెల్లుల్లి ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. అయితే ఈ సంవత్సరం ఏర్పడిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వెల్లుల్లి ఉత్పత్తి అంతంతమాత్రంగానే ఉంది..
ఈ పంటను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తారు. సంవత్సరం ఆ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురవడంతో వానకాలం పంట దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఇప్పటివరకు ఉన్న నిల్వలు మొత్తం పూర్తయ్యాయి. కొత్త పంట వచ్చేవరకు ఉండటంతో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సరుకుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో 60 నుంచి 70 రూపాయల వరకు పలికే కిలో వెల్లుల్లి ప్రస్తుతం 500 కు చేరింది. దీంతో వెల్లుల్లి వ్యాపారులు అత్యంత జాగ్రత్తగా తాము నిల్వ ఉంచిన సరుకును ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ధర విపరీతంగా పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో వెల్లుల్లి పంట కోతకు వచ్చింది. ధర భారీగా పెరగడంతో రైతులు పంటను విక్రయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువ మంది కూలీలతో పంటను కోయిస్తున్నారు. ధర పెరిగిన నేపథ్యంలో దొంగల బెడద ఎక్కువైంది. దీంతో రైతులు తమ పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో టమాటా ధర పెరిగినప్పుడు కూడా రైతులు ఇదే తీరుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా మధ్యప్రదేశ్లో ఓ రైతు తన వెల్లుల్లి తోట చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు తాలూకు దృశ్యం సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది.