Rajashyamala Yagam: రాజశ్యామల యాగం.. ఈ యాగం చాలా శక్తివంతమైనదని, నిష్టతో ఈ యాగం చేస్తే కోరుకున్నది జరుగుతుందని పండితులు చెబుతారు. అయితే ఈ యాగం ఇప్పుడు రాజకీయ నాయకుల కారణంగా చలా మందికి తెలిసింది. గతంలో తక్కువ మంది ఈ యాగం చేసేవారు. కానీ, శత్రుబాధ పోవడానికి, విజయం సిద్ధించడానికి చేసే ఈ యాగాన్ని ఎన్నికల సమయంలో నాయకులు నిర్వహిస్తున్నారు. ఖర్చుతో కూడుకున్నది అయినా.. ఖర్చుకు వెనుకాడకుండా యాగం నిర్వహిస్తున్నారు. గతంలో ఈ యాగాన్ని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చాలాసార్లు చేశారు. ఆయనకు విజయం కూడా వరించింది. దీంతో 2019లో ప్రస్తుత ఏపీ సీఎం కూడా ఈ యాగం నిర్వహించారు. దీంతో ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కూడా యాగం బాటపట్టారు. ఉండవల్లిలోని తన నివాసంతో ఐదు రోజులుగా ఈ యాగం నిర్వహిస్తున్నారు. సతీసమేతంగా ఈ క్రతువులో ఆయన పాల్గొంటున్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది.
ఎన్నికల వేళనే..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసింది. దాదాపు 70 స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. కొందరికి టికెట్ ఇవ్వకపోగా, మరికొందరిని బదిలీ చేసింది. ఇక టీడీపీ కూడా అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. అయితే ఆ పార్టీ పొత్తల విషయం ఇంకా కొలిక్కి రాకపోవడంతో అభ్యర్థుల ఎంపికకు ఆటంకంగా మారుతోంది. జనసేన టీడీపీ కలిసి పోటీ చేయడం ఖాయమైనీ బీజేపీని కూడా కలుపుకుపోవాలన్న టీడీపీ ఆశలు నెరవేరడం లేదు. ఇక ఈ ఎన్నికల్లో కలిసి రావడానికి అటు సీఎం జగన్, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు దేవుళ్లను కూడా నమ్ముకుంటున్నారు. దైవం ఆశీస్సులు ఉండాలని పూజలు చేస్తున్నారు.
చంద్రశేఖర్‌రావు బాటలో చంద్రబాబు..
తాజాగా చంద్రబాబు నాయకుడు తెలంగాణ మాజీ సీఎం చంద్రశేఖర్‌రావు బాటలో పయనిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో యాగం చేస్తున్నారు. వారంపాటు ఈయాగం నిర్వహించనున్నారు. చంద్రబాబు సతీసమేతంగా యాగంలో పాల్గొంతున్నారు. శత్రుబాధ పోవాలని, విజయం సిద్ధించాలని, రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలని ఈ యాగం చేస్తారు.
అధికారం కోసమే యాగం..
రాజకీయాల్లో ఉండే నాయకులు చేసే ఈ యాగం కేవలం అధికారం కోసమే. ఇది చంద్రబాబు చేయడం తొలిసారి. కానీ గతంలో చాలా మంది నేతలు ఈ యాగం చేశారు. తెలంగాణ మాజీ సీఎం పలుమార్లు యాగం చేశారు. 2019 ఎన్నికలకు ముందు విశాఖలోని శారదపీఠంలో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఈ యాగం నిర్వహించారు. విజయం సాధించారు. ప్రత్యర్థులను బలహీనం చేయడానికే నాయకులు ఎన్నికల సమయంలో ఈ యాగాలు చేస్తారని పండితులు చెబుతున్నారు. చంద్రబాబు వైసీపీని గద్దె దించేందుకే ఈయాగం నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. మరి రాజశ్యామల యాగం చంద్రబాబుకు రాజయోగం తెస్తుందో లేదో చూడాలి.