Gandhi Godse Trailer Review: సినిమా అనేది ఒక బలమైన మాధ్యమం.. దర్శకుడు కథను ఎంత బలంగా చెప్పగలిగితే… ప్రేక్షకులు అంతకంటే ఎక్కువ కనెక్ట్ అవుతారు.. కానీ రాను రాను ఈ కొలతలన్నీ కూడా కమర్షియల్ లెక్కల్లో కొట్టుకుపోతున్నాయి.. తొక్కలో ఫైట్లు, స్టెప్పుల ఇమేజ్, ఫార్ములా సినిమాలే రాజ్యమేలుతున్నాయి.. ఒక కొత్త కథకు ప్రాణం పోస్తే, తెలిసిన కథకు కొత్తదనం అద్దితే, ప్రేక్షకుల బుర్రల్లో మధనం సాగిస్తే అది గొప్పదనం అవుతుంది.. సినిమాకు మరింత హుందాతనాన్ని తీసుకొస్తుంది.. ఇలాంటి కోవకే చెందుతాడు రాజ్ కుమార్ సంతోషి. ఈ బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు తీసిన సినిమాలన్నీ కూడా దృశకావ్యాలే.. చరిత్రను వర్తమానానికి అన్వయించి చెప్పడంలో ఇతడికి ఇతడే సాటి.. 66 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ నిత్య యవ్వనుడిలా, సినిమాపై ప్రేమతో చిత్రాలు తీస్తూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాడు. జనంలోకి చర్చను వదిలే కథలను తను భలే రాస్తాడు.. చక్కగా తీస్తాడు.. జేమ్స్ కామెరున్ మాదిరి తనకు సరైన అవుట్ ఫుట్ వచ్చేదాకా నటీ నటులను పిండుతాడు.. అలాగని అతడి సినిమాలో ఓకే సైడ్ ఉండవు.. రెండు బలమైన పరస్పర విరుద్ధ వాదనలను అంతకంటే బలంగా ప్రజెంట్ చేస్తాడు.. అందులో ఏ సైడ్ తీసుకోవాలో.. ఏ సైడ్ తీసుకోకూడదో ప్రేక్షకుడి ఇష్టం.

జనవరి 30 ,1948… మహాత్మా గాంధీ నాదూరం గాడ్సే చేతిలో హతమయ్యాడు. ఇదంతా కూడా మనకు తెలిసిన చరిత్ర.. కానీ ఈ చరిత్రకు రాజ్ కుమార్ సంతోషి కొత్త కల్పన జోడిస్తున్నాడు. గాంధీ వర్సెస్ గాడ్సే అనే పేరుతో సినిమా తీస్తున్నాడు. అలాగని ఇది బయోపిక్ కాదు. రియాల్టీ అంతకన్నా కాదు. జస్ట్ ఫిక్షన్.. గాడ్సే కాల్పుల్లో గాంధీ చనిపోడు.. గాడ్సే ను కలుసుకుంటాడు.. ఇద్దరి వాదనలు కూడా బలమైనవే.. సంఘర్షిస్తాయి. గాడ్సే లోని ఆవేశాన్ని, గాంధీలోని ఆదర్శాన్ని ప్రభావంతంగా ప్రజెంట్ చేశాడు రాజ్ కుమార్.. ఆగని ఇదేమి డాక్యుమెంటరీ కాదు.. కథే.. కానీ ఒక కల్పన.. ట్రైలర్ ఇంతగా ఆలోచింపచేస్తున్నదంటే… ఇక సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిందే… నటీనటులు కూడా ఆ పాత్రలో ఒదిగిపోయినట్టు కనిపిస్తోంది.
రెండు గుడ్డ పీలికలు తప్ప మరి ఏమి లేని దీపిక బరిబాతలతనం… వెగటు పుట్టించే థర్డ్ క్లాస్ సినిమా ఫీట్లతో షారుక్… దీపిక మూవ్ మెంట్స్ చూస్తుంటే ప్రొఫెషనల్ వ్యాంప్స్ కూడా అలా చేయరేమో… ఆ పఠాన్ వంటి చిల్లర తనం కంటే ఇలాంటి గాంధీ_ గాడ్సే చిత్రాలు ఎంతో నయం కదా? హిందుత్వకు గాడ్సే వెర్షన్ వేరు.. గాంధీ వెర్షన్ వేరు.. రాజ్ కుమార్ అలాంటి ఒక చర్చను జనంలోకి బలంగా వదులుతాడు.. మరో దర్శకుడు అయితే అశ్లీలాన్ని నెత్తిన మోస్తూ, దీపికను అర్ధనగ్నానికంటే ఎక్కువ మోతాదులో చూపిస్తూ కంపర సిద్ధాంతాన్ని ప్రదర్శిస్తాడు మరోదర్శకుడు. అందుకే పఠాన్ల వేషాలు పగిలిపోయి, గాంధీ గాడ్సే లు బలంగా థియేటర్లకు వస్తే.. అర్థవంతమైన సినిమాలు మరిన్ని వస్తాయి.
ఇలాంటి చర్చ నే ది కశ్మీరీ ఫైల్స్ బలంగా తీసుకురాగలిగింది. చర్చను తీసుకొచ్చింది. తప్పేముంది? సినిమా బలమైన మాధ్యమం అనుకున్నప్పుడు… బలమైన చర్చ జరిగితేనే కదా దానికి అర్థం. కాషాయవాదానికి గాడ్సే హీరో అయితే… గాంధీ చెప్పిన ఆదర్శం చెవులకు ఎక్కదు. అలాంటి సమయంలో హిందుత్వం మీద సమాజంలో చర్చ జరుగుతుంది..గాంధీ వర్సెస్ గాడ్సే వంటి సబ్జెక్టులు మరిన్ని వస్తేనే బాగుంటుంది.. అయితే కత్తి మీద సాము, లేని ఉద్రిక్తతలు పెంచకుండా ఆరోగ్యకరమైన చర్చకు ఆస్కారం ఇస్తేనే చాలా బాగుంటుంది.

ఉదాహరణకు దృశ్యం సినిమానే తీసుకోండి.. అందులో క్రైమ్ స్టోరీ ఉత్కంఠ సడలని కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందులో హీరో చేసింది చట్టరీత్య సమర్థినీయమా? కాదా? పక్కన పెడితే అడుగడుగునా ఒక శక్తివంతమైన ఎమోషన్ మనల్ని సీటుకు కట్టేసి మరీ చూపిస్తుంది.. ఉంచాయ్ సినిమా కూడా అలౌకికమైన నాన్ కమర్షియల్ బంధాలు అంటే ఏమిటో చెబుతుంది. ముసలి వయసులోనూ జీవితం మీద ప్రేమను పెంచుతుంది. ఆశలను రేకెత్తిస్తుంది. కాంతారా సినిమా అసలు నటన అంటే ఏమిటో కళ్ళ ముందు ఉంచుతుంది. అసలైన ప్రాంతీయ ఆధ్యాత్మిక సంస్కృతి ఏమిటో, జనం విశ్వాసాలు ఏమిటో ఆవిష్కరిస్తుంది.. ఇలాంటి కథలు, ఎన్నో ఉండగా.. రెండు గుడ్డ పీలికల తో కలగలిసిన ఇనుప గుగ్గిళ్ళ లాంటి పఠాన్ సినిమాలు ఎందుకు? ప్రేక్షకులకు డబ్బులు ఏమైనా ఊరకనే వస్తున్నాయా?