Ganapathi Laddu Thief: విశ్వనగరం.. భాగ్యనగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వినాయక చవితి మండపాలే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా దొంగలు మాత్రం చోరీలను ఆపడం లేదు. ఇప్పటికే మౌలాలిలో గణపతి లడ్డూను దొంగలు ఎత్తుకెళ్లగా.. తాజాగా మియాపూర్ పరిధిలోని మదీనాగూడలో ఇదే ఘటన చోటుచేసుకుంది.
లడ్డూలే లక్ష్యంగా..
దొంగతనం అనగానే.. బంగారం.. వెండి.. నగదు లేదా ఇతర ఏదైనా విలువైన వస్తువులు పోయాయా అనే సందేహం వస్తుంది. కానీ, హైదరాబాద్‌లో దొంగలు వినాయక లడ్డూలనుఏ టార్గెట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక విగ్రహానికి ఎంత ప్రాధాన్యత ఉందో.. ఆయన చేతిలో లడ్డూ ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. గణపతితో పాటు.. ఆయన చేతిలో పెట్టే లడ్డు కూడా నవరాత్రులు పూజలు అందుకుంటుంది. ఆ లడ్డూను నవరాత్రుల చివరి రోజు వేలం వేస్తారు. ఈ లడ్డూను దక్కించుకున్నవారిని అదృష్టవంతులుగా భావిస్తారు. అయితే, దొంగలు ఈ లడ్డూను కూడా వదిలిపెట్టడం లేదు.
జాతీయ రహదారి పక్కనే..
జాతీయ రహదారి పక్కన ఓంకార సేవా సమితి ఏర్పాటు చేసిన భారీ గణనాథుడి చేతిలో ఉన్న 11 కేజీల లడ్డూను అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా వినాయకమండపంలోకి చొరబడి.. లడ్డూ ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఉదయం మండపానికి వచ్చిన వారు గమనిస్తే లడ్డూ లేకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా విషయం బయటపడింది. నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లడ్డూ దక్కించుకునేందుకు పోటీ..
గణపతి చేతిలో నవరాత్రులు పూజలందుకున్న లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడతారు. బాలాపూర్ లడ్డూ వేలం లక్షల్లో పలుకుతుంటే.. చిన్న చిన్న మండపాల్లో కూడా లడ్డూలు వందల నుంచి వేల రూపాయలు పలుకుతోంది. గణపతి లడ్డూ దక్కించుకున్న కుటుంబానికి సిరిసంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తులు విశ్వాసిస్తారు. కానీ దొంగలు ఈ లడ్డూలనే టార్గెట్ చేస్తున్నారు. వినాయకుడి లడ్డూలనే ఎందుకు ఎత్తుకెళ్తున్నారు.. ఎవరు చేస్తున్నారు.. అని ఛేదించే పనిలో పోలీసులు ఉన్నారు.
కెమెరాకు చిక్కిన లడ్డు దొంగ
హైదరాబాద్ – మియాపూర్ గణేష్ మండపం వద్ద పెట్టిన 11కేజీల లడ్డు దొంగతనం చేస్తూ ఓ యువకుడు సీసీటీవీ కెమెరాలలో దొరికాడు. pic.twitter.com/8lT5ytP5yY
— Telugu Scribe (@TeluguScribe) September 21, 2023