Rajasthan Stray Dog: నేటి కాలంలో అనుబంధాలు మాయమైపోతున్నాయి. ప్రేమలు కనుమరుగైపోతున్నాయి. ఆప్యాయతలు కలగర్బంలో కలిసిపోతున్నాయి. మనుషులను కేవలం డబ్బు మాత్రమే నడిపిస్తోంది. డబ్బు ఆధారంగానే మనుషుల జీవితాలు సాగుతున్నాయి.
ఇటువంటి మనీ కాలంలో సాటి మనిషిని పోతే కన్నీరు కార్చడం పక్కన పెడితే.. కనీసం చూసేందుకు కూడా తీరిక ఉండడం లేదు. వాట్సాప్ లో స్టేటస్ గా.. ఫేస్ బుక్ లో రిప్ అనే మెసేజ్లు పెడుతున్నారు. అంతేతప్ప.. సాటి మనిషి చనిపోయాడని బాధ ప్రదర్శించలేకపోతున్నారు. కన్నీటిని ఒలికించ లేకపోతున్నారు.
ఇటువంటి కాలంలో ఒక వీధి కుక్క చనిపోతే ఊరు ఊరంతా కదిలింది. కన్నీరు పెట్టింది. ఇంట్లో మనిషి చనిపోయినట్టుగా బాధపడింది. అంతేకాదు ప్రతి ఇంటి నుంచి జనం బయటికి వచ్చారు. ఆ కుక్క కు డప్పు చప్పులతో.. భజనలతో.. కీర్తనలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఖననం చేశారు. ఒక కుక్కకు ఈ స్థాయిలో అంతిమయాత్ర జరగడం నిజంగా ఆశ్చర్యమే.
ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్య వ్యాస్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ గ్రామంలో ఓ కుక్క చాలా రోజులుగా పెరుగుతోంది. అది ఎవరు తీసుకొచ్చారో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. ఆ కుక్క గ్రామంలో ఎవరు చనిపోయిన సరే అక్కడికి వెళుతుంది. అంత్యక్రియలు జరిగేంతవరకు అక్కడే ఉంటుంది. ఆ తర్వాత కర్మకాండలు జరిగే సమయంలో కూడా వెళ్తుంది. కొన్ని సందర్భాలలో శవాలను దహనం చేసిన చోట ఉంటుంది. రాత్రి మొత్తం అక్కడే పడిగాపులు కాస్తూ ఉంటుంది. ఆ తర్వాత కన్నీరు పెడుతుంది. కొన్ని సందర్భాలలో గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయితే ఆ కుక్క అనూహ్యంగా చనిపోవడంతో గ్రామం మొత్తం కన్నీరు పెట్టింది. ఆ కుక్కకు తమ గ్రామానికి ఏదో బలమైన సంబంధం ఉందని.. దేవుడు ఆ కుక్కను పంపించి ఉంటాడని గ్రామస్తులు నమ్ముతున్నారు. అందువల్లే ఆ కుక్కకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.