Dog Meat : గ్రామాల్లో సహజంగానే అడవి జంతువుల మాంసం అనగానే ఎగబడుతుంటారు. అడవి పంది, జింక సహా పలు రకాల జంతువుల మాంసాన్ని ఎంతకైనా పెట్టి కొంటుంటారు. అయితే అది నిజమైన అడవి పంది, జింకనా? అని మాత్రం ఎవరూ చూడరు. అదే మాంసం అనుకొని వండుకొని తినేస్తారు.
దీన్నే కొంతమంది కేటుగాళ్లు వ్యాపారంగా మలుచుకున్నారు. జింక మాంసం అంటూ ప్రజలను బురిడీ కొట్టించి సొమ్ము చేసుకుంటున్నారు.తాజాగా నిర్మల్ జిల్లాలో దారుణమైన నిజం వెలుగుచూసింది.
సాధారణంగా మేక, గొర్రె మాంసాన్ని ఇట్టే గుర్తుపట్టవచ్చు. కానీ ఎప్పుడూ తినని అడవి పంది, జింక మాంసాల రుచిని, పచిని కనిపెట్టలేం. దీన్నే క్యాష్ చేసుకున్న మోసగాళ్లు.. తాజాగా జింక మాంసం అంటూ బురిడీ కొట్టించారు.
తాజాగా నిర్మల్ జిల్లాలోని చందానగర్ లో ఓ పెంపుడు కుక్క దొంగతనం జరిగింది. వీధికుక్క అంటే మరీ జనాలు నమ్మరు అనుకొని ఓ పెంపుడు కుక్కను బాగా బలిష్టంగా ఉన్న దాన్ని దొంగిలించారు. ఆనంద్ అనే వ్యక్తి పెంచుకుంటున్న కుక్కను పొట్టెపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాస్, వరుణ్ దొంగిలించారు. గుట్టు చప్పుడు కాకుండా చంపేశారు. పథకం పేరుతో చుట్టుపక్కల గ్రామాల్లో జింక మాసం అని చెప్పి అమ్మారు. చుట్టూ అడువులు ఉండేసరికి నిజంగానే జింక మాసం అనుకొని చాలా మంది కొనుక్కొని తిన్నారు.
అయితే కుక్క యజమాని తమ కుక్కలేదని ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీసీ కెమెరాను పరిశీలించి ఇద్దరు వ్యక్తులు కుక్కను దొంగిలించినట్టు తేల్చారు. వారిని విచారించగా కుక్కమాంసాన్ని జింక మాసంగా అమ్మినట్టు తెలిపారు. ఇక కుక్కను తిన్న జనాలు మాత్రం కంగారుపడిపోతున్నారు. అందుకే అంటారు ఏది పడితే అది తినొద్దని..