
Chandrababu: రాష్ట్రంలో కొద్ది రోజుల కిందట జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్థికి ఓటు వేయడం సరికొత్త చర్చకు దారి తీసింది. ఇది చంద్రబాబు మైండ్ లో నుండి వచ్చిన మాస్టర్ ప్లాన్ గా, సిబిఎన్ చాణిక్య నీతిగా పలువురు అభివర్ణిస్తుంటే.. అనైతిక చర్యకు పాల్పడి అడ్డగోలుగా చంద్రబాబు గెలిచాడంటూ మరికొందరు విమర్శలు చేస్తున్నారు. అసలు ఈ వ్యవహారంలో నైతికత ఏది..? అనైతికత ఏది..? అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
చంద్రబాబుది చాణిక్యమా..? అనైతిక చర్యా..?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీకి నిలబెట్టిన పంచుమర్తి అనురాధ విజయం కోసం చంద్రబాబు నాయుడు సర్వశక్తులు ఒడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు తనతో పాటే ఉంటే ఈ సీటు గెలవడం చంద్రబాబుకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది నెలలకే నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరారు. అధికారికంగా వైసీపీ గూటికి చేరినప్పటికీ ఆ పార్టీతోనే కలిసి ఉంటున్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదని భావించిన చంద్రబాబు.. ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించారు. అధికార పార్టీలోనే ఉంటూ అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యేలను మా దారిలోకి తెచ్చుకొని ఓటు వేయించుకోవాలని భావించారు. అందుకు అనుగుణంగానే వ్యూహాలను రచించి విజయం సాధించారు. అయితే ఈ చర్యలను అధికార పార్టీకి చెందిన నాయకులు తీవ్రంగా విమర్శిస్తుంటే, టిడిపి నాయకులు మాత్రం సమర్థించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అనైతిక చర్యకు పాల్పడ్డారంటూ వైసీపీ సలహాదారు సజ్జలతో పాటు పలువురు నాయకులు వ్యాఖ్యానించారు. ఇక టిడిపి నాయకులైతే.. చంద్రబాబు నాయుడు చాణిక్యమే ఎన్నికల్లో విజయం సాధించేలా చేసిందని చెబుతున్నారు. పార్టీ నుంచి ఏ విధంగా నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ తీసుకుందో.. అదే తరహాలో తాము వైసిపి ఎమ్మెల్యేలను తీసుకుని ఓట్లు వేయించుకున్నామని చెబుతున్నారు. వైసీపీ చేసినది అనైతికమైతే, తాము చేసినది అనైతికమని, వారిది నైతికమైతే.. మాది నైతికమేనని చెబుతున్నారు.
ఆజ్యం పోసింది చంద్రబాబు..
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అధికార పార్టీలోకి తీసుకునే చర్యలను విభజిత రాష్ట్రంలో చంద్రబాబు ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది శాసనసభ్యులను టిడిపిలోకి తీసుకొని, వారిలో నలుగురికి మంత్రి పదవులను చంద్రబాబు ఇచ్చాడు. ఈ విధంగా చంద్రబాబు మొదటిసారి గోడ దూకే వ్యవహారాలకు నాంది పలికాడని, 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి అదే తరహాలో మరో నలుగురు టిడిపి శాసనసభ్యులను తమ పార్టీతో అంట కాగేలా చేసిందని చెబుతున్నారు. వైసీపీ తాజాగా చేసిన దానికి దెబ్బతీసేలా టిడిపి అదే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను టిడిపిలోకి తీసుకుని ఎమ్మెల్సీ ని గెలిపించుకుందని చెబుతున్నారు. అధికారిక లెక్క ప్రకారం అసెంబ్లీలో టిడిపికి ఉన్న బలం మేరకే ఓట్లు పడ్డాయని, ఇందులో అడ్డగోలు వ్యవహారమే లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ తరహా రాజకీయాలు..
ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులను మరో పార్టీలోకి తీసుకోవడం రాజకీయంగా అనైతిక చర్యలకు పాల్పడడమేనని నిపుణులు చెబుతున్నారు. ఎవరు చేసినా ఈ తరహా చర్యలను సమర్థించాల్సిన అవసరమే లేదని, తరహా చర్యలపై కఠిన చట్టాలు రావాల్సిన అవసరం ఉందన్న భావనను నిపుణులు విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి చోట్ల బీజేపీ కూడా ఈ తరహా చర్యలకు పాల్పడిందని, ఈ చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మహారాష్ట్రలో బిజెపి ఏకంగా మూడు వంతుల మంది ఎమ్మెల్యేలను ఒకవైపు లాగేసి, సీఎం సీటుతోపాటు మొత్తంగా పార్టీనే లాగేసిందని, ఇది దురదృష్టకరమైన ఘటనలుగా పలువురు విశ్లేషిస్తున్నారు.
చంద్రబాబుకు ప్రజల్లో పెరిగిన మద్దతు..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీటును గెలుచుకుంది. ఈ సీటు ఎలా గెలుచుకున్నప్పటికీ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే చంద్రబాబుకు మద్దతు పెరిగినట్లుగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మూడు చోట్ల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి మూడు చోట్ల గెలవడం ప్రజల్లో ఆ పార్టీకి పెరిగిన మద్దతును తెలియజేస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగితే వచ్చే ఎన్నికల నాటికి టిడిపికి మరింత సానుకూల అవకాశాలు ఉంటాయన్నది నిపుణుల విశ్లేషణ.