
TV Rama Rao: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికలను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. గెలుపు కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసేందుకు లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ తరుణంలో వైరి పక్షం నేతలను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా మానసిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో జంపింగ్ జపాంగ్ లు సంఖ్య రానున్న రోజుల్లో పెరిగే అవకాశం కనిపిస్తోంది. అధికార వైసీపీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. మొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పార్టీకి దూరం కాగా, ఆనం అదే బాటలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఒక మాజీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేశారు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేశారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించడం లేదని, కొందరి కారణంగా కనీసం సీఎంను కలిసే అవకాశం కూడా దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరులో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేశానని, తనకు ఇచ్చిన హామీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో టిడిపి ఎమ్మెల్యేగా పనిచేసిన రామారావు ఇప్పుడు తిరిగి టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే సీటు పైన ఇంకా ఆయనకు స్పష్టమైన హామీ దక్కలేదని తెలుస్తోంది.
గుర్తింపు లభించకపోవడంతోనే..
పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన టీవీ రామారావు అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలో తనకు గుర్తింపు లభించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరు పార్టీ అభ్యర్థి ప్రస్తుత హోం మంత్రి తానేటి వనితను గెలిపిస్తే భవిష్యత్తులో పదవులు కల్పిస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతున్న తనకు ఇచ్చిన హామీ అమలు కాలేదని, పైగా సీఎంను కలవాలని ప్రయత్నించినా కొందరు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కొందరికే పదవులు దక్కుతున్నాయని, పార్టీ పదవి కోరినా కనీసం పట్టించుకోలేదని ఆవేదన చెందారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నానని రామారావు వివరించారు. కార్యకర్తలకు న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.

జనసేనలో చేరుతారని ప్రచారం..
రామారావు జనసేనలో చేరతారు అంటూ కొంత కాలంగా ప్రసారం సాగుతోంది. అందుకే వైసీపీకి రాజీనామా చేశారన్న చర్చ నడుస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని రామారావు ఖండించారు. తాను జనసేనలో చేరడం లేదని స్పష్టత ఇచ్చారు. 2009లో రామారావు కొవ్వూరు నుంచి టిడిపి అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తరువాత చోటు చేసుకున్న ఒక వివాదంలో ఆయన చిక్కుకున్నారు. 2014, 19 ఎన్నికల్లో ఆయనకు టిడిపి టికెట్ దక్కలేదు. ఆ సమయంలోనే రామారావు వైసీపీలో చేరారు. పార్టీలో చేరే సమయంలో తానేటి వనిత విజయానికి తోడ్పాటు అందించాలని పార్టీ నేతలు సూచించారు. అందుకు అనుగుణంగానే కృషి చేశారు. అయితే, పార్టీలో సరైన గుర్తింపు లభించకపోవడంతో రాజీనామా చేసిన ఆయన.. 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో టిడిపిలోకి వెళ్లేందుకు మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. సీటుకు సంబంధించిన హామీ ఇంకా దక్కలేదని, టీడీపీ పెద్దలు నుంచి ఆ దిశగా హామీ లభిస్తే చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
