
Janasena Activists- Nadendla Maohar: తెలుగునాట అత్యంత ఆకర్షణీయమైన నేత ఎవరంటే చటుక్కుమని గుర్తుకొచ్చే పేరు పవన్ కళ్యాణ్. సక్సెస్ తో సంబంధం లేకుండా తన క్రేజ్ ను నిలుపుకుంటూ వస్తున్నారు. ఆయన బయటకు వస్తే వేలాది మంది అభిమానులు అనుసరిస్తారు. ఆయన మాటలకు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారు. చప్పట్లు కొట్టి ప్రోత్సాహమందిస్తారు. అయితే గత పదేళ్లుగా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. అభిమానులు, పార్టీని అనుసరించే వారు పెరుగుతున్నారు. కానీ ఆ అభిమానం ఓట్లుగా మారడం లేదు. అదే జనసేన వీక్నెస్ కు కారణం. దానిని గుర్తించింది పార్టీ హైకమాండ్. సమయం వచ్చినప్పుడల్లా పవన్ ఇదే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మీ అభిమానం చూసి పొంగిపోయానని.. కానీ ఓట్లు ఆ స్థాయిలో మాత్రం దక్కడం లేదని బాధను సైతం వ్యక్తం చేశారు. తాజాగా నాదేండ్ల మనోహర్ అటువంటి కఠువైన వ్యాఖ్యలు చేశారు.
జన సైనికులపై ఒక అపవాదు ఉంది. సోషల్ మీడియాలో చూపించే యాక్టివిటీ.. క్షేత్రస్థాయిలో చూపరు అన్న ముద్ర ఉంది. ట్విట్టర్‌లో రెండు మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారని జనసేన శ్రేణులు చాలా గొప్పగా చెప్పకుంటాయి. పవన్ కూడా తనపై చూపుతున్న అభిమానంపై ఆనందం వ్యక్తం చేశారు. బయట ఎంత దూకుడుగా ఉంటారో.. సోషల్ మీడియాలో సైతం జన సైనికుల వార్ అలానే ఉంటుంది. పవన్ పుట్టిన రోజు వేడుకలు, ప్రత్యేక దినాలు, సినిమాలు రిలీజ్ అయినప్పుడు ట్వీట్లు హోరెత్తించి ట్రెండింగ్ లోకి తెస్తారు. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి అటువంటి దూకుడు కనిపించడం లేదు.. వినిపించడం లేదు. అందుకే మిగతా రాజకీయ పక్షాల వద్ద జన సైనికులు పలుచన అవుతున్నారు. అయితే పవన్ అడుగులో అడుగువేసే నాదేండ్ల మనోహర్ తన మనసులో మాటను బయటపెట్టేశారు. జనసైనికులు మారితే తప్ప ప్రయోజనం లేదని తేల్చేశారు.

జనసేనలో ఉన్నవారు పవన్ కళ్యాణ్ అభిమానులే. అంతవరకూ ఒప్పుకోవాల్సిందే కానీ ఇందులో ఎక్కువగా వ్యక్తిగత గుర్తింపు కోసం ఆరాటపడే వారి సంఖ్యే అధికం. ప్రజల్లో తిరిగే వారి సంఖ్య చాలా తక్కువన్న టాక్ ఉంది. కనీసం అభిమానం ఉన్న వారిని పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువచ్చే సైన్యమే లేదన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ప్రత్యేకంగా ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీ పదో ఆవిర్భావ సభ జరుగుతున్న సమయంలో నాదేండ్ల మనోహర్ ఇదో ప్రాధాన్యతాంశంగా తీసుకొని కామెంట్స్ చేశారు.సోషల్ మీడియా పోస్టుల వల్ల ఒక్క ఓటు కూడా రాదని.. ప్రజల్లోకి వెళ్లాలని వారికి పవన్ కల్యాణ్ విజన్ గురించి చెప్పాలని.. జనసేన ఆశయాల గురించి ప్రచారం చేయాలని వాళ్లను ఓట్లు వేసే విధంగా మోటివేట్ చేయాలన్నారు. అలా కాకుండా.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటే ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు.
జనసైనికుల విషయంలో ఇప్పటికే వైసీపీ గోబెల్స్ ప్రచారం చేసింది. పవనన్నను ప్రేమిస్తాం.. కానీ జగనన్నకు ఓటేస్తాం అన్నట్టు సోషల్ మీడియా వేదికగా చేసుకొని చాలా రకాలుగా ప్రచారం చేస్తోంది. అందుకే జనసైనికులను ఇతర పార్టీల నాయకులు, తటస్థులు లైట్ తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇతర పార్టీలకు విపరీతంగా తిట్టే జన సైనికులు జనసేనకు ఓటు వేయరన్న అభిప్రాయం విస్తరిస్తోంది. ఇటువంటి తరుణంలో నాదేండ్ల మనోహర్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జన సైనికులను ఆలోచింపజేస్తున్నాయి.
