
K. A. Paul- CBI JD Lakshminarayana: కేఏ పాల్… కిలారి ఆనంద్ పాల్.. ఈ పేరుకో బ్రాండ్ ఇమేజ్ ఉంది. ప్రపంచాన్నే అతీతమైన తన దైవభక్తితో నడిపించగలనని చెప్పుకొచ్చే మత ప్రబోధకుడు ఆయన. అగ్రదేశాలను ఏలిన పాలకులు సైతం తన ప్రాపకం కోసం పడిగాపులు కాస్తారని చెప్పుకొని వచ్చే ఒక మహా మేధావి. అయితే గతంలోకి తొంగిచూస్తే అందులో వాస్తవాలు ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆయన ఒక ఫన్నీ క్యారెక్టర్. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ కావాలసిన వినోదం పంచుతుంటారు. చిలిపి మాటలతో చిల్లర చేష్టలతో తన స్థాయిని దిగజార్చుకుంటారు. దైవదూత నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఈ మత ప్రబోధకుడి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఆయన్ను కలవడానికి, వేదిక పంచుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ మేధావిగా, నిజాయితీ ఆఫీసర్ గా పేరుపొందిన జేడీ లక్ష్మీనారాయణ మాత్రం ఆ సాహసం చేశారు.
స్టిల్ ప్లాంట్ పై జేడీ పోరాటం..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఇటీవల జేడీ లక్ష్మీనారాయణ గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఏకంగా స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో సైతం పాల్గొంటున్నట్టు ప్రకటించారు. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా గెలిచి ఉంటే స్టీల్ ప్లాంట్ కు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాసినప్పుడు, బిడ్ లో పాల్గొని విశాఖ స్టీల్ ను పరిరక్షించుకుంటామని కేసీఆర్ నిర్ణయం ప్రకటించినప్పుడు కూడా జేడీ ఆహ్వానించారు. వారిని ఆకాశానికి ఎత్తేశారు. కేంద్ర ఉక్కు సహాయ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై భిన్న ప్రకటన చేసినప్పుడు ఆ క్రెడిట్ ను వారి ఖాతాలో వేస్తూ జేడీ కీర్తించారు. దీంతో ఆయన మనసు బీఆర్ఎస్ వైపు వెళ్లిందని ప్రచారం జరగడంతో పాటు విశ్లేషణలు వెలువడ్డాయి.
పాల్ తో వేదిక పంచుకోవడంపై..
అయితే ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తో జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యక్షం కావడంతో విభిన్న కామెంట్స్, సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇంత బతుకు బతికి ఇదేంది జేడీ అంటూ కామెంట్స్ చేస్తున్న వారే అధికం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో అసలు సీఎం జగన్ ఏంచేశారని కేఏ పాల్ ప్రశ్నించారు.తనకు యాక్టింగ్ రాదని.. యాక్షన్ మాత్రమే వచ్చన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కపట నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. అటు జేడీ లక్ష్మీనారాయణ సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగా చేశాయని ఆరోపించారు. 32 మంది బలిదానాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడంతో ప్రస్తుతం 8 వేల మంది నిర్వాసితులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను ఇద్దరు నాయకులు చెడుగుడాడుకున్నారు.

పొలిటికల్ సటైర్లు..
ప్రస్తుతం జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ జంక్షన్ లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీచేయాలన్న బలమైన ఆకాంక్షతో ఉన్నారు. తనను మెచ్చి చేర్చుకునే పార్టీతో పనిచేస్తానని.. వాటితోనే ఎంపీగా తన కల సాకారం చేసుకుంటానని చెబుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని పార్టీల్లో ఎంపీ అభ్యర్థులతో బెర్తులు నిండిపోయాయి. పోనీ జనసేనలోకి తిరిగి వెళదామంటే పవన్ కూడా పిలవడం లేదు. దీంతో చివరకు ప్రజాశాంతి పార్టీ ద్వారా బరిలోకి దిగేందుకే జేడీ డిసైడ్ అయినట్టున్నారని కామెంట్స్ జోరందుకుంటున్నాయి. లేకుంటే పాల్ తో వేదిక పంచుకునే సాహసం ఎందుకు చేస్తారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.