Lionel Messi Records: ఫిఫా వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్, అర్జెంటీనా తలపడనున్నాయి. తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న మెస్సి ఎలాగైనా తన జట్టుకు కప్ అందించాలని తాపత్రయపడుతున్నాడు. 36 సంవత్సరాలుగా కప్ కోసం అర్జెంటీనా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది.. 2014లో ఫైనల్ లోకి వెళ్లినప్పటికీ కప్ దక్కించుకోలేకపోయింది.. అయితే ఈసారి ఎలాగైనా జట్టును ప్రపంచ విజేతగా నిలపాలని మెస్సి తన సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. అంతేకాదు మరో రెండు అరుదైన ఘనత లకు చేరువలో ఉన్నాడు.

గోల్డెన్ బూట్
ఫిఫా ప్రపంచ కప్ లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు.. ఈ అవార్డును 1982 వరల్డ్ కప్ నుంచి ఇవ్వడం ప్రారంభించారు.. తొలుత ఈ అవార్డును గోల్డెన్ షుగా పిలిచేవారు.. 2010లో దీన్ని గోల్డెన్ బూట్ అవార్డుగా మార్చారు.. ప్రస్తుత ప్రపంచ కప్ గోల్డెన్ బూట్ రేసులో అర్జెంటీనా దిగ్గజం మెస్సి, ఫ్రాన్స్ యువ సంచలనం కైలియన్ మబప్పే చెరో ఐదు గోల్స్ తో సమంగా ఉన్నారు.. ఈ క్రమంలో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో రారాజు ఎవరో తేలిపోతుంది.. అయితే వీరిద్దరికీ ఫ్రాన్స్ దిగ్గజ ఆటగాడు ఒలివర్ గిరౌడ్, అర్జెంటినా ఆటగాడు జూలియన్ అల్వా రేజ్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురవుతున్నది. గోల్డెన్ బూట్ పోటీలో వీరిద్దరు కూడా చేరో నాలుగు గోల్స్ తో రెండవ స్థానంలో ఉన్నారు.
గోల్డెన్ బూట్ టై బ్రేకర్స్ అవార్డులో..
ఫైనల్ ముగిసే సమయానికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆటగాళ్లు అత్యధిక గోల్స్ తో సమంగా నిలిస్తే దాన్ని గోల్డెన్ బూట్ టై బ్రేకర్స్ అంటారు.. ఈ సమయంలో ఎవరైతే అత్యధిక అసిస్ట్ లు, తక్కువ నిమిషాలు ఆడి ఉంటారో వారిని విజేతగా నిర్ణయిస్తారు. గోల్ చేసే స్కోరర్ కు బంతిని పాస్ చేయడం లేదా క్రాస్ చేయడం చేస్తే ఆటగాడి ఖాతాలో అసిస్ట్ చేరుతుంది. కాగా అసిస్ట్ ల ప్రకారమైతే మూడు అసిస్ట్ లతో మెస్సీ ముందంజలో ఉన్నాడు.. మబప్పే (477).. మెస్సీ(570) కంటే ముందు ఉన్నాడు.

గోల్డెన్ బాల్ రేసు లోనూ..
ఫిఫా ప్రపంచ కప్ లో ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి గోల్డెన్ బాల్ అవార్డు లభిస్తుంది.. ఈ పోటీలో మెస్సీ, మబప్పే, మోడ్రిక్ రేసులో ఉన్నారు.. అయితే ఈసారి మెస్సి తన చివరి మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో.. ఎలాగైనా తన జట్టుకు కప్ అందించాలనే యోచనలో ఉన్నాడు.. చివరి మ్యాచ్లో ఒకటి లేదా రెండు గోల్స్ చేస్తే కప్ తో పాటు గోల్డెన్ బాల్, బూట్ పురస్కారం కూడా అందుకుంటాడు. ఇవి మూడు సాధిస్తే అరుదైన ఆటగాడిగా మెస్సి రికార్డు సృష్టిస్తాడు. ఒక క్రీడాకారుడికి ఇంతకంటే ఘనమైన వీడ్కోలు ఇంకేముంటుంది.