
Amaravati Movement: మూర్ఖుడైన రాజుతో ప్రజలు తలపడడం ఎంత ప్రమాదకరమో తెలుసా.. ఇప్పుడు అమరావతి రైతులు చేస్తోంది అదే. వైసీపీ సర్కారుపై ప్రజా పోరాటం చేస్తూనే.. మరో వైపు న్యాయ పోరాటాన్ని సైతం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వారు పడుతున్న కష్టాలు, కడగండ్లు అన్నీ ఇన్నీకావు. తమకున్న యావదాస్తిని అమరావతికి ఇచ్చి ఇప్పుడు రోడ్డున పడ్డారు. అమరావతిని గొంతుకోసి చంపే ప్రయత్నం చేస్తుంటే తల్లడిల్లిపోయారు. తట్టుకోలేక రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. ప్రభుత్వ నిర్బంధాలు, దమనకాండలు వారిని అడ్డుకోలేకపోయాయి. కరోనా మహమ్మారి వారి ఆశయం ముందు చిన్నబోయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 1200 రోజుల పాటు ప్రజా ఉద్యమం చేపట్టిన అమరావతి రైతులు చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నారు.
మూడున్నర సంవత్సరాలైన పడని ముందడుగు..
దక్షిణాఫ్రికా తరహాలో జగన్ ఆటోచించి దాదాపు మూడున్నర సంవత్సరాలైంది. మూడు రాజధానులను తెరపైకి తెచ్చినా అడుగు ముందుకు వేయలేకపోయారు. దానికి కారణం అమరావతి రైతుల ఉద్యమం. న్యాయపోరాటం.అయితే వారి పోరాటం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. వాటిని దిగమింగుకొని మొక్కవోని దీక్షతో ముందుకెళ్తున్నారు. రాజధాని అంశాన్ని నిర్వీర్యం చేసేందుకు జగన్ సర్కారు చేయని ప్రయత్నం లేదు. కులం, మతం, ప్రాంతం ముద్ర వేశారు. కేవలం 29 గ్రామాల సమస్యగానే చూపారు. అడుగడుగునా ఉక్కుపాదం మోపారు. అటువంటి పాలకులతో అమరావతి రైతులు పోరాడుతున్నారు. తమకు న్యాయం జరిగితే రాష్ట్రం బాగుపడుతుందన్న బలమైన ఆకాంక్షతో ఉద్యమం కొనసాగిస్తున్నారు.
కనీస బాధ్యత లేకుండా.,..
ప్రజల పట్ల, రాష్ట్ర ఉన్నతి పట్ల పాలకులు ఇంతోకొంత చిత్తశుద్ధితో పనిచేస్తారు. కానీ జగన్ సర్కారులో అటువంటి వాటికి చాన్సే లేదు. మేం చెప్పిందే చట్టం.. మేం చేసిందే శాసనం అన్నట్టు రాజ్యాంగం సృష్టించిన అన్ని వ్యవస్థల్లోకి చొరబడుతున్నారు…చెరబడుతున్నారు. ఎక్కడా కనీస బాధ్యత కనిపించదు. రాష్ట్ర భవిష్యత్ ను పాతాళంలోకి తొక్కేసినా ఎటువంటి సమస్య లేదని ఈజీగా చెప్పగల గడసరులు. చట్టం, రాజ్యాంగం, న్యాయవ్యవస్థ..ఇలా అన్ని వారి ముందు దిగదుడుపే. అటువంటి విపరీత ఆలోచనతో ఉన్నవారిపై అమరావతి రైతులు పోరాటం చేస్తున్నారు. వారి ఆకాంక్షకు ప్రజల మద్దతు తోడైంది. అమరావతిని చంపి మమ్మల్ని అందలమెక్కించే ప్రయత్నం వద్దంటూ ఉత్తరాంధ్ర పట్టభద్రులు, మేధావులు జగన్ సర్కారుకు గట్టి సంకేతాలే ఇచ్చారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా హెచ్చరికలు పంపారు.

ప్రజల్లో వీడుతున్న భ్రమలు…
ప్రజల కళ్లకు గంతలు కట్టి రాజధాని డ్రామాను రక్తి కట్టించాలని జగన్ చూశారు. కుల,మత, వర్గాలుగా విభజించి ప్రజలను మభ్యపెట్టేలా చూశారు. కానీ ఆ మబ్బులు క్రమేపీ వీడుతున్నాయి. ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. అమరావతి రైతులు పోరాడుతున్నది వారి కోసం కాదు. రాష్ట్ర భవిష్యత్ కోసమేనని అందరూ మేల్కొంటున్నారు. ఓటు అనే ఆయుధంతో తిప్పికొట్టారు. పాలకుల వికృత క్రీడకు చరమగీతం పాడుతామని హెచ్చరికలు పంపారు. అయితే వైసీపీ జుగుప్సాకర రాజకీయాలపై అమరావతి రైతుల పోరాటమే ఇప్పుడు అందరి నోట వినిపిస్తోంది. ప్రజల్లో వస్తున్న నిశ్శబ్ధ విప్లవానికి అమరావతి ఉద్యమమే నాంది పలికిందని విశ్లేషకులు చెబుతున్నారు.