Emotional Video: మన జీవితంలో చిరస్థాయిగా బలపడి.. నిలబడి.. నిలిచి ఉండేది దాంపత్య బంధం మాత్రమే. నేటి కాలంలో యువతీ యువకులకు దాంపత్య బంధం గురించి అంతగా అవగాహన ఉండడం లేదు. చేతినిండా డబ్బు.. అపరిమితమైన స్వేచ్ఛ.. జీవన విధానంలో మార్పు వంటివి వారికి దాంపత్య జీవితం గురించి చులకన భావం ఏర్పడేలా చేస్తున్నాయి. చిన్న చిన్న వాటికి కోపాలు పెంచుకోవడం.. పంతాలకు వెళ్లిపోవడం.. పట్టు విడుపులు లేకుండానే ఎదుటి వ్యక్తి నుంచి దూరం జరగడం.. దూరాన్ని పెంచుకోవడం వంటివి చేస్తున్నారు. తద్వారా దాంపత్య జీవితాన్ని ఆస్వాదించకుండానే ఏకాకులుగా మిగిలిపోతున్నారు. ఎంత సులభంగా అయితే కలిసిపోతున్నారో.. అంతే సులభంగా విడాకులు తీసుకుంటున్నారు. సాధారణంగా ఇటువంటి పెడ పోకడలు పాశ్చాత్య దేశాలలో ఎక్కువ కనిపిస్తుంటాయి. కాకపోతే అటువంటి పద్ధతులు ఇటీవల కాలంలో మనదేశంలో కూడా పెరిగిపోయాయి. ఉదాహరణకు మనం ఎంతగానో అభిమానించే క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చాహల్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ప్లేయర్లు విడాకులు తీసుకున్నారు. వీరిలో వీరేంద్ర సెహ్వాగ్ సీనియర్ ఆటగాడు.. చాలా సంవత్సరాల క్రితమే అతడికి వివాహం జరిగింది. ఇక యజువేంద్ర చాహల్ కు వివాహం జరిగి రెండు సంవత్సరాలు పూర్తికాక ముందే విడాకులు తీసుకోవడం విశేషం. హార్దిక్ పాండ్యా ఒక కుమారుడు పుట్టిన తర్వాత.. దంపతుల మధ్య బేధాభిప్రాయాలు తలెత్తి విడాకులు తీసుకున్నారు. సామాన్యుల కంటే సెలబ్రిటీలే విడాకులు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. భాగస్వామికి సమయం ఎక్కువగా కేటాయించలేకపోవడం.. భాగస్వామితో మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోవడం.. ఇతర సంబంధాలపై ఆకర్షితులు కావడంతో త్వరగా విడాకుల వైపు సెలబ్రిటీలు వెళ్తున్నారు.
Also Read: దాయాది క్షిపణులు ఔట్.. S-400 సిస్టమ్ ప్రత్యేకతలేంటి?
కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో
వివాహం జరిగిన కొంతకాలానికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి. అవి విడాకులకు దారి తీస్తున్నాయి. కానీ సెలబ్రిటీలు.. ఇతరులు తమ విడాకులు తీసుకునే ముందు ఒక్కసారి గ్రామాలలో లేదా ఒక మోస్తరు పట్టణాలలో కలిసి ఉంటున్న వృద్ధ దంపతులను చూస్తే విడాకులు తీసుకోవాలని కోరిక వారిలో పూర్తిగా నశించిపోతుంది. ఎందుకంటే వృద్ధ దంపతులు చివరి దశలో ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉంటారు. తోడు నీడగా జీవిస్తుంటారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో దాంపత్య జీవితానికి అసలు సిసలైన అర్థం చెబుతోంది. జీవితంలో ఒక తోడు అనేది లేకుంటే.. సరైన జోడు అనేది లేకుంటే ఎంత వ్యర్ధమో ఆ వీడియో చూపిస్తోంది. ఆ వీడియోలో వృద్ధురాలైన తన భార్యకు.. ఆ భర్త సపర్యలు చేస్తున్నాడు. ఆమెను మంచం మీద నుంచి పైకి లేపి.. అన్నం తినిపిస్తున్నాడు. ఆ తర్వాత ఆమెతో కబుర్లు చెబుతున్నాడు. ఆమె అంతటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తన భర్త చెప్పింది మొత్తం వింటున్నది. కొన్ని సందర్భాల్లో నవ్వుతున్నది. ఇంకొన్ని సందర్భాల్లో ఏడుస్తున్నది. అందుకే మన జీవితంలోకి ఎంతోమంది వస్తుంటారు.. అంతే సంఖ్యలో వెళ్ళిపోతుంటారు. కానీ చివరి వరకు నిలిచేది భర్తకు భార్య.. భార్యకు భర్త మాత్రమే.. ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో ఈ కాలపు యువత తెలుసుకుంటే విడాకులు అనే విషయం వారి మదిలో ఉండదు.. దాంపత్య జీవితానికి మించిన సౌఖ్యం ఇంకొకటి వారికి కనిపించదు.