Telangana BJP: నాకు సీఎం పదవి మీద ఆశ లేదని బండి సంజయ్ అంటాడు.. కానీ జితేందర్ రెడ్డి మాత్రం కాబోయే ముఖ్యమంత్రి బండి సంజయ్ అని విలేకరుల ముందు చెబుతాడు.. కిషన్ రెడ్డి కూడా నేను ముఖ్యమంత్రి అయ్యేందుకు అర్హుడినే అంటూ కుండ బద్దలు కొడతాడు. ఇక డీకే అరుణ అయితే నేను ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. ఈటల రాజేందర్ కూడా ప్రజలు కోరుకుంటే నేను ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఇటీవల సందర్భాల్లో చెప్పుకొచ్చారు. వీరందరి వ్యాఖ్యలు చూస్తుంటే ఆలూ లేదు. చూలూ లేదు. కొడుకు పేరు సోమలింగం అన్న సామెత గుర్తుకు వస్తున్నది. అసలు తెలంగాణలో ఎన్నికలు రాలేదు.. అధికారాన్ని దక్కించుకోలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి కావాలనే మీరు తాపత్రయం ప్రజల్లో చులకన చేస్తున్నది.

అంత బలం ఉందా
భారత రాష్ట్ర సమితికి మేమే ప్రత్యామ్నాయమని పలు సందర్భాల్లో చెప్పుకొస్తున్న భారతీయ జనతా పార్టీకి.. క్షేత్రస్థాయిలో అంత బలం ఉందా అంటే లేదనే సమాధానం వస్తుంది.. ఇవాల్టికి 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆ పార్టీకి లేరు.. ఇది కొంచెం ఇబ్బంది కలిగించే విషయం అయినప్పటికీ కచ్చితంగా అంగీకరించాల్సిందే.. అయితే దుబ్బాక, హుజురాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలా గెలిచామని ఆ పార్టీ నాయకులు ప్రశ్నించవచ్చు.. కానీ ఇదే సమయంలో నాగార్జునసాగర్, హుజూర్ నగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోయిన విషయాన్ని ఆ పార్టీ మరవరాదు. వాస్తవానికి భారత రాష్ట్ర సమితిని ఎండగట్టే విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ముందు వరుసలో ఉన్నప్పటికీ… జనాల్లో మరింత మైలేజ్ రావాలి అంటే అది సరిపోదు.. ఒక వేళ అదే కనుక ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి నాయకులు వ్యవహరిస్తున్న తీరు మరో విధంగా ఉండేది.
అభ్యర్థులు ఉన్నారా
తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి.. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ కి అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు.. ఇవాల్టికి ఒక నాయకత్వం అంటూ లేని కాంగ్రెస్ పార్టీకి డబుల్ డిజిట్ స్థాయిలో అభ్యర్థులు ఉన్నారు. పైగా క్షేత్రస్థాయిలో వీరికి కొద్దో గొప్పో ఓటు బ్యాంకు ఉంది. ఈ ఓటు బ్యాంకు ను చీల్చి చెండాడలని కెసిఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఇదే సమయంలో బిజెపికి అన్ని స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు లేరు. ఒకవేళ ఉన్నా జనాల్లో వారికి ఆ స్థాయిలో చరిష్మా లేదు. అది లేదు కాబట్టే మోదీ బొమ్మను పట్టుకొని ఓట్లు అడగాల్సిన పరిస్థితి ఉంటుంది. క్షేత్రస్థాయిలో బలాన్ని మరింత పెంచుకొని భారత రాష్ట్ర సమితి ఢీకొట్టాలనే సోయి లేని ఆ పార్టీ నాయకులు… కాబోయే ముఖ్యమంత్రి మేమంటే మేమని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది.

అధినాయకత్వం ఏం చేస్తున్నట్టు
బిజెపి అనేది సైద్ధాంతిక పార్టీ కాబట్టి.. కొన్ని విలువలను కచ్చితంగా పాటిస్తుంది. ముఖ్యంగా క్రమశిక్షణ విషయంలో కట్టుదిట్టంగా ఉంటుంది.. అయితే తెలంగాణలో ఎవరికి వారు మేమే సీఎం అభ్యర్థులమని ప్రకటించుకుంటున్న నేపథ్యంలో అధినాయకత్వం ఏం చేస్తోందనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఒకవేళ ఇటువంటి వ్యాఖ్యలు కనుక టిఆర్ఎస్ పార్టీలో వినిపిస్తే కచ్చితంగా మెడపట్టి బయటికి గెంటేసేవారు.. అంటే ఒక మనిషి తాను అనుకున్న మాటను స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదా అని మీరు అడగవచ్చు.. కానీ ఎలాగూ నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది.. మరి బి ఎల్ సంతోష్ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఈ సీఎంల సమస్యకు ఏ విధంగా చెక్ పెడతారో వేచి చూడాల్సి ఉంది.