Homeజాతీయ వార్తలుBRS: ఎన్నికల ఏడాది బీఆర్‌ఎస్‌కు ఎదురు దెబ్బలు!

BRS: ఎన్నికల ఏడాది బీఆర్‌ఎస్‌కు ఎదురు దెబ్బలు!

BRS
KCR

BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార బీఆర్‌ఎస్‌ ఒకటి అనుకుంటే.. ఇంకోటి అవుతోంది. వరుసగా ఎదురు దెబ్బలు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతోపాటు, క్యాడర్‌లో ఆత్మస్థైర్యం సన్నగిల్లుతోంది. గత కొంతకాలంగా ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే, వారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు కూడా రంగంలోకి దిగి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంటే, ప్రతిపక్షాలకు కేసీఆర్‌ చెక్‌పెట్టారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు టీఎస్పీఎస్సీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అనేక ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తూ, పరీక్షలు నిర్వహిస్తూ నిరుద్యోగులలో ఉద్యోగాలపై చిరు ఆశలను మొలకెత్తించిన బీఆర్‌ఎస్‌ పార్టీ వచ్చే ఎన్నికలలో ఉద్యోగ నోటిఫికేషన్లతో యువత మద్దతు కూడా తమకే ఉంటుందని భావించింది. కానీ కథ అడ్డం తిరిగింది.

లీకేజీలతో డ్యామేజీ..
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో బీఆర్‌ఎస్‌ను పెద్ద ఎత్తున డ్యామేజీ జరుగుతోంది. కల్వకుంట్ల వారసురాలు కవిత ఇప్పటికే ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా టీఎస్‌పీఎస్సీ వ్యవహారం తెలంగాణ ముఖ్యమైన మంత్రి, కేసీఆర్‌ రాజకీయ వారసుడు కేటీఆర్‌కు చుట్టుకుంటోంది. మరోవైపు ఎమ్మెల్యేల ఎర కేసు.. సీబీఐకి అప్పగింతపై పిటిషన్‌ సుప్రీంలో పెడింగ్‌లో ఉంది. సీబీఐకి అనుకూలంగా తీర్పు వస్తే అది కేసీఆర్‌ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. వరుస ఎదురు దెబ్బలు బీఆర్‌ఎస్‌ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేస్తోంది. మరోవైపు పేపర్ల లీకేజ్‌ వ్యవహారంలో కేటీఆర్‌ పోరాటం చేయాల్సి వస్తుంది. గత అక్టోబర్‌ నుంచిì∙టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏడు పరీక్షల్లో నాలుగు పరీక్షలను రద్దు చేయడంతో నిరుద్యోగులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ప్రజల్లో గులాబీ పార్టీపై ఇప్పటికే వ్యతిరేకత ఉంది. తాజా వ్యవహారాలు ఎన్నికల నాటికి మరింత డ్యామేజీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

విపక్షాల ఎదురు దాడి..
ఏళ్ల తరబడి ఎదురు చూస్తే పరీక్షలు పెట్టారు. ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాస్తే వాటిని పేపర్‌ లీకేజీ పేరుతో మళ్లీ రద్దు చేశారు. ఇలా అయితే ఎలా అంటూ నిరుద్యోగులు తీవ్ర అసహనంతో, ఆగ్రహంతో ఉన్నారు. ఇక ఇదే అదునుగా ప్రతిపక్షాలు మూకుమ్మడిగా యువతను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో వెనుక ఉంది కేటీఆర్‌ అని సంచలన ఆరోపణలు చేస్తూ బండి సంజయ్, రేవంత్‌ రెడ్డి కేటీఆర్‌ ను టార్గెట్‌ చేస్తున్నారు. కేటీఆర్‌ పీఏ తిరుపతి గురించి రేవంత్‌ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. వాళ్ల ఊరి వాళ్ల పేపర్లను మార్కులను బయటకు తీయాలని డిమాండ్‌ చేశారు.

BRS
tspsc paper leak

సిట్‌ నోటీసులతో మరింత డ్యామేజీ..
విపక్షాలకు చెక్‌ పెట్టాలని కేటీఆర్‌ సిట్‌తో రేవంత్‌కు నోటీసులు ఇప్పించినట్లు సమాచారం. అయితే రేవంత్‌ కూడా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. సిట్‌ నోటీసులకు బయపడేది లేదని స్పష్టం చేశారు. దీంతో కేటీఆర్‌కే డ్యామేజీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఐటీ మంత్రిగా కేటీఆర్‌కు, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ హోదాలో ఉన్న జనార్దన్‌రెడ్డికి నోటీసులు ఇవ్వాల్సిన సిట్‌ విపక్షాలను టార్గెట్‌ చేయడంపై ప్రజల్లో కూడా వ్యతిరే భావన వ్యక్తమవుతోంది. తెలంగాణ సర్కారు కనుసన్నల్లోనే సిట్‌ పనిచేస్తుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాక్షేత్రంలో తిరుగుతూ సంచలన ఆరోపణలు చేస్తూ కేటీఆర్‌ను టార్గెట్‌ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల ముఖ్య నాయకులకు సిట్‌ ద్వారా నోటీసులు జారీ చేసి వారి నోటికి తాళం వెయ్యాలని ప్రయత్నాలు బీఆర్‌ఎస్‌కే నష్టం చేసే అవకాశం కనిపిస్తోంది.

మొత్తంగా చూస్తే ఇది బీఆర్‌ఎస్‌ పార్టీకి ఊహించని సమస్య. ఎన్నికల సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి యువత ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని, ప్రతిపక్షాలకు చెక్‌ పెట్టాలని ప్రయత్నం చేసిన పేపర్ల లీకేజీ వ్యవహారం ఊహించని చిరాకుకు కారణంగా మారింది. మరి ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ బయటపడుతుందా? మళ్లీ యువతకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపైన నమ్మకం కలిగిస్తుందా? అనేది వేచి చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular