Eenadu Vs Sakshi Vs Andhra Jyothi: దమ్మున్న పత్రిక, దమ్మున్న ఛానల్ అని వేమూరి రాధాకృష్ణ జబ్బలు చరుచుకుంటాడు గాని.. వాస్తవంలో అంత సీన్ లేదని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తేల్చి చెప్పేశారు. నీది ఎప్పుడైనా మూడో స్థానమే నాయన అని రెండో మాటకు తావు లేకుండా వివరించారు. ఒక ఆంధ్రజ్యోతికే ఈ దురవస్థ. మిగతావన్నీ కొద్దో గొప్పో బాగానే ఉన్నాయి. అంటే 2019 స్థాయిలో ఉన్నాయని కాదు. ఆ స్థాయికి చేరుకుంటాయని కాదు. కరోనా భయాల అనంతరం పత్రికల సేల్స్ తో పోల్చి చూసుకుంటే ఇప్పుడు ఏ పత్రికా అంత గొప్పగా లేదు. చివరికి ఈనాడు తో సహా. ఈ లెక్కన చూసుకుంటే ప్రింట్ మీడియా పరిస్థితి బాగుపడే సూచన కనిపించడం లేదు. ఇక పై బాగుపడుతుందనే నమ్మకం కూడా లేదు.
దేశవ్యాప్తంగా పత్రికల గతిని శాస్త్రీయంగా సూచించేవి ఏబీసీ లెక్కలు. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఫిగర్స్ కొన్ని రోజుల క్రితం వచ్చాయి. జాతీయస్థాయిలో ఎవరూ రాసుకోలేదు. దైనిక్ భాస్కర్, దైనిక్ జాగరణ్, మలయాళ మనోరమ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, మాతృభూమి…ఇలా తోపు పేపర్లు మొత్తం నేల చూపులే చూస్తున్నాయి.. వీటిలో కొన్ని కొన్ని పబ్లిష్ హౌస్ లు ఆల్రెడీ డిజిటల్ బాట పట్టాయి. 2024 ఎన్నికల తర్వాత ఇవి దాదాపుగా తమ ప్రింటింగ్ క్లోజ్ చేస్తాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ దేశంలో దైనిక్ జాగరణ్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటుంది. కానీ నేను నెంబర్ వన్ అని చెప్పుకోలేని దురవస్థ దానిది. ఒకప్పుడు లక్షల్లో కాపీలతో అలరారుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆ పరిస్థితి లేదు.
ఏ బి సి లెక్కల్లో తెలుగు పత్రికలు ఏఏ స్థానాల్లో ఉన్నాయో గనుక చూసుకుంటే.. ఇవాల్టికి ఈనాడుదే మార్కెట్లో నెంబర్ వన్ ప్లస్.. చివరకు వాణిజ్య ప్రకటనలకు అత్యంత కీలకమైన హైదరాబాద్లో కూడా ఈనాడు మళ్లీ నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేసింది ( 2022 జనవరి నుంచి జూన్ లెక్కల్లో హైదరాబాదులో సాక్షి ఈనాడును దాటేసింది.. తర్వాత అది ఆరు నెలల ముచ్చట అయిపోయింది).. ఈనాడు గొప్ప పత్రిక అని కాదు.. అది సాక్షికి ముత్తాత. పోటీ పత్రికల ప్రమాణాలు ఘోరంగా పాతరేస్తున్నాయి కాబట్టి.. వాటితో పోల్చితే ఈనాడు ప్రమాణాలు కొంచెం తక్కువ స్థాయిలో పాతరేయబడుతున్నాయి కాబట్టి.. పాఠకులు కూడా ఈనాడే నయం రా బాబు అనుకుంటున్నారు. అంతకుముందు అర్ధవార్షికంతో పోలిస్తే ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ కాస్త పెరిగింది. కోవిడ్ సంక్షోభం అనంతరం కాస్త పరిస్థితులు చక్కబడుతున్నందున మళ్లీ పత్రికల మార్కెటింగ్ సిబ్బంది యాక్టివ్ అయిపోయారు. అదీ అసలు కారణం.
అయితే ఈ క్రతువులో ఆంధ్రజ్యోతి కేవలం 24 వేల కాపీలు మాత్రమే పెంచుకోగలిగింది. ఈనాడు 1.3 లక్షల కాపీల్ని పెంచుకోగలిగింది. సాక్షి 75 వేల కాపీలు పెంచుకోగలిగింది. ఈ లెక్కన వాలంటీర్లతో జగన్ చేసిన కొనుగోలు అనే ప్రయత్నం అడ్డగోలుగా ఫెయిల్ అయింది అని చెప్పుకోవచ్చు. ఈనాడుని కొట్టేసే దారిలో జగన్ ఫెయిల్ అయ్యాడు. హైదరాబాదులోని నెంబర్ వన్ స్థానాన్ని ఆరు నెలల మురిపెం తర్వాత మళ్లీ రామోజీరావుకు కట్టపెట్టాడు. అత్యంత కమర్షియల్ జోన్ గా హైదరాబాదులో సాక్షి 2.57 లక్షల సర్క్యులేషన్ కలిగి ఉంది. ఈనాడు 3.05 ఐదు లక్షల కాపీలతో నెంబర్ వన్ స్థానంలో ఉంది..ఇక ఈ జాబితాలో ఆంధ్రజ్యోతి 55,000 కాపీలతో మిగతా వాటికి చాలా దూరంలో ఉంది.
ఆంధ్ర పరిస్థితికి వస్తే కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి ఎడిషన్లో సాక్షి ఈనాడు కంటే ముందంజలో ఉంది.. మిగతా అన్నిచోట్లా ఈనాడే నెంబర్ వన్. జగన్ రాజధాని అని చెప్తున్న విశాఖపట్నంలో సాక్షి కంటే ఈనాడే ఎక్కువ. సర్క్యులేషన్ కూడా సాక్షితో పోల్చితే డబల్. ప్రస్తుత రాజధాని విజయవాడలో సాక్షి 60,000 అయితే.. ఈనాడు 90,000. తెలంగాణలో కూడా ఈనాడే టాప్. నిజామాబాదులో ఈనాడు 41 వేల తో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. సాక్షి 18,000, ఆంధ్రజ్యోతి జస్ట్ పదివేలు. మహ బూబ్ నగర్ లో సాక్షి 16 వేలు, ఈనాడు 39 వేలు, ఆంధ్రజ్యోతి 9 వేలు, చివరకు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి మెట్రోల్లో కూడా ఈనాడే టాప్.
స్థూలంగా చెప్పాలంటే సాక్షి అడ్డదారుల్లో సర్కులేషన్ పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తుందని ఈనాడు కోర్టుకెక్కింది. ఈ పంచాయితీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. వాలంటీర్లకు దినపత్రికల్ని కొనేందుకు డబ్బులు ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చి సాక్షి కాపీలు ఎక్కువగా అమ్ముడుపోవడానికి జగన్ తప్పుడు దారిలో ప్రయత్నిస్తున్నాడు అనేది ఈనాడు ఆరోపణ. అంటే ఈ లెక్కన జగన్ ప్రయత్నాలు ఫలించలేదు.. అలాగని దమ్మున్న పత్రిక అని చెప్పుకునే రాధాకృష్ణను కూడా జనం దేకడం లేదు. ఉదయం లేస్తే పోతురాజు మాదిరి పచ్చ చర్నాకోల్ తో కొట్టుకుంటున్నా సరే ఆ తెలుగు తమ్ముళ్ళు పట్టించుకోవడం లేదు. చివరకు కరోనా భయాల అనంతరం ఈనాడు, సాక్షి మెరుగుపడ్డాయి. ఈ జాబితాలో స్టూడెంట్ ఎడిషన్ తో కలిపితే.. సాక్షి ఫిగర్స్.. ఈనాడు కంటే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తాయి.