England Vs India: లాజిక్కే : ఇంగ్లండ్ కు E, ఇండియాకు ‘i’.. ఎందుకీ తేడా?

వాస్తవానికి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా పేరుపొందిన తెలుగు భాషకు, ఇంగ్లీష్ భాషకు చాలా వ్యత్యాసం ఉంటుంది. తెలుగు భాషకు వచ్చేసరికి కర్తరి వాక్యంతో మొదలవుతుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 28, 2024 8:12 am

England Vs India

Follow us on

England Vs India: భాషించునది భాష. ఆ భాషను పరివ్యాప్తం చేసేది అక్షరం. మనుషుల మధ్య మాటలను బలోపేతం చేసేది లిపి. అందుకే ఒక దేశానికి సంబంధించి, ఒక జాతికి సంబంధించి లిపి అనేది అత్యంత ముఖ్యమైనది. నాటి సింధూ నాగరికత నుంచి మొదలు పెడితే నేటి నవ నాగరికత వరకు లిపి అనేది అత్యంత కీలకపాత్ర పోషించింది. పోషిస్తున్నది కూడా. అయితే, ఈ లిపిలలో ఎన్నో తేడాలున్నాయి. ముఖ్యంగా ప్రపంచ భాషగా వెలుగొందుతున్న ఇంగ్లీషులో ఎన్నో వైరుధ్యాలు ఉన్నాయి. దానికి, మన తెలుగుకు అసలు పొంతన ఉండదు. కొన్ని పదాలలో సైలెంట్ వర్డ్స్ ఉంటాయి. వాటిని పలకడంలో ఒక్కోసారి తప్పిదం చోటు చేసుకుంటుంది. ఉదాహరణకు ఇంగ్లీషులో ఇంగ్లాండ్ ను “ఈ” అనే అక్షరంతో మొదలుపెట్టి రాస్తారు. అదే ఇండియాకు వచ్చేసరికి “ఐ” అనే అక్షరాన్ని వాడతారు. ఇండియాకు “ఐ” వాడి.. ఇంగ్లాండ్ కు ” ఈ” వాడటం ఏంటో ఇంగ్లీష్ వాళ్లకే తెలియాలి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ సందడి చేస్తున్నాయి.. రెండూ ఒకే రకంగా ఉచ్చరిస్తున్నప్పటికీ.. ఎందుకు అంత వైరుధ్యమో ఇప్పటికీ అంతు పట్టడం లేదు. దీనికి సంబంధించి అటు ఇంగ్లీష్ భాషా నిపుణులు కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

వాస్తవానికి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా పేరుపొందిన తెలుగు భాషకు, ఇంగ్లీష్ భాషకు చాలా వ్యత్యాసం ఉంటుంది. తెలుగు భాషకు వచ్చేసరికి కర్తరి వాక్యంతో మొదలవుతుంది. అదే ఇంగ్లీష్ కు వచ్చేసరికి కర్మణి వాక్యంతో సంభాషణ మొదలవుతుంది. దీంతో అసలు భావం అర్థమయ్యేసరికి బుర్ర బద్దలవుతుంది. మనం తెలుగులో “రాముడు మామిడిపండు తిన్నాడు” అని అంటాం. అదే ఇంగ్లీషు వాళ్ళు “మామిడిపండు రాముడు చేత తినబడింది” అని పలుకుతారు. కేవలం ఈ వాక్యం మాత్రమే కాదు.. చాలా సందర్భాల్లో ఇలాంటి తికమక ఉంటుంది కనుకే.. ఇప్పటికీ మనకు ఇంగ్లీష్ అనేది ఒక కొరకరాని కొయ్యలాగా మారిపోయింది. అందులో గ్రామర్, ఇతర వ్యవహారాలు కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ.. అర్థం చేసుకుంటే సులువే. కానీ, అర్థమవడమే కష్టం.

ఇండియా మాత్రమే కాదు వెస్టిండీస్ ను డబ్ల్యూ అనే అక్షరంతో మొదలు పెడతారు. అదే వెనిగర్ అనే పదాన్ని “వీ” అనే అక్షరంతో స్టార్ట్ చేస్తారు.. సరే వెస్టిండీస్ అనేది దేశం కాబట్టి, మినహాయింపు ఇచ్చారనుకుందాం. ఇండోనేషియా దేశం పేరు రాసే క్రమంలో “ఐ” అనే అక్షరం వాడతారు. అదే ఇథియోపియా విషయానికి వచ్చేసరికి “ఈ” అనే అక్షరాన్ని ముందుగా రాస్తారు. మరి దానికి, దీనికి తేడా ఏంటో ఇంగ్లీష్ వాళ్లకే తెలియాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఒకటి మాత్రం నిజం. భాష అనేది సరళంగా ఉండాలి. సంక్లిష్టతను నివారించాలి. భావాన్ని విశదీకరించాలి. అంతేతప్ప ఇలా తలనొప్పిని సృష్టించవద్దు. అందుకే మనదేశంలో చాలామంది ఇంగ్లీష్ అంటే జంకేది.