Greater Noida Society: మనిషి అన్నాక కాసింత కళా పోషణ ఉండాలి అన్నట్టు.. శరీరం అన్నాక దానిని సంరక్షించేందుకు దుస్తులు వేసుకోవాలి. ఆ దుస్తులు ఎలా ఉండాలో వారి వారి శరీర ఆకృతిని బట్టి ఉంటుంది. కొందరు జీన్స్ ధరించేందుకు ఇష్టపడతారు.. మరికొందరు కాటన్ దుస్తులు వేసుకునేందుకు ఆసక్తి చూపుతారు. అంతేకానీ ఎటువంటి బట్టలు వేసుకోవాలి? ఎలా వేసుకోవాలి? అనేవి వ్యక్తిగత ఇష్టాలు. వాటిల్లో మనం పెత్తనం చెలాయిస్తే ” నాకేంటి నువ్వు చెప్పేది” అంటూ ఎదురు ప్రశ్నిస్తారు.. వాస్తవానికి ప్రాంతీయ వైవిధ్యం, వాతావరణం, జీవన విధానం, సంస్కృతితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వస్త్రధారణల ప్రభావంతో భారతీయ సమాజం పరిణామం చెందింది. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఓ అపార్ట్మెంట్ సొసైటీ విధించిన డ్రెస్ కోడ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది.
బయటకు రావద్దు
ఢిల్లీలోని గ్రేటర్ నోయిడా పరిధిలో హిమ్ సాగర్ అనే అపార్ట్మెంట్ సొసైటీ ఉంది. ఇక్కడ చాలా కుటుంబాలు నివసిస్తాయి. ఇందులో చాలామంది కూడా ఉద్యోగస్తులే. ఉత్తర భారతదేశం కావడంతో రకరకాల సంస్కృతులు ఉన్నవారు ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. మామూలుగా అయితే ఈ అపార్ట్మెంట్ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదు..మొన్న జూన్ 10న ఈ అపార్ట్మెంట్ నిర్వాహకులు ఉన్నట్టుండి ఒక డ్రెస్ కోడ్ తీసుకొచ్చారు.. వినటానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. దాన్ని అమల్లో పెట్టేశారు. ఓ స్కూల్ స్టూడెంట్ల మాదిరి డ్రెస్ కోడ్ నిబంధనలను విధించారు. ఇక ఈ అపార్ట్మెంట్ నిర్వాహకులు జారీ చేసిన ఉత్తర్వులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. నిర్వాహకులు విధించిన నిబంధనలను ప్రకారం ఫ్లాట్ ల నుంచి బయటకు వచ్చేవారు పురుషులైతే లుంగీలు ధరించకూడదు. మహిళలు అయితే నైటీలు వేసుకోకూడదు. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి వాటిని ధరించి బయటికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సొసైటీ ప్రాంగణంలో వాకింగ్ డ్రెస్ కోడ్ పేరుతో గ్రేటర్ నోయిడా పేజ్ _ 2 లోని హిమ్ సాగర్ హౌసింగ్ సొసైటీ తీసుకొచ్చిన ఈ నిబంధనలపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
” మీరు బయటకు వచ్చినప్పుడు మీ వస్త్రధారణ పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అందుకే ఎవరు బయటకు వచ్చినా కచ్చితంగా లుంగీ, నైటీ ధరించి తిరగవద్దని అభ్యర్థిస్తున్నాం. దీనివల్ల జరిగే అనర్థాలకు మా బాధ్యత కాదు” అంటూ అపార్ట్మెంట్ నిర్వాహకులు విధించిన నిబంధనలో పేర్కొన్నారు. అయితే ఈ చర్యను కొంతమంది సమర్థిస్తుండగా, మరి కొంతమంది విమర్శిస్తున్నారు..” బహిరంగ ప్రదేశాల్లో నడిచేందుకు నైటీలు, లుంగీలు సరైనవి కావు. వీటిని పాతకాలం నాటివని పరిగణిస్తున్నారు. అయితే వస్త్రధారణ విషయంలో కొన్ని పద్ధతులు అవలంబించాలి. ఇది చాలా వరకు నేరాలను నియంత్రిస్తుంది” అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ” లుంగీలు, నైటీలు మాత్రమే కాదు ప్రింటెడ్ బాక్సర్ షార్టులు, ప్రింటెడ్ నైట్ సూట్లు, స్పోర్ట్స్ వేర్ ను కూడా నిషేధించాలి” మరొకరి వ్యాఖ్యానించారు. ఇది ఖాప్ పంచాయతీగా ఉందని మరొక వ్యక్తి మండిపడ్డాడు. భావ వ్యక్తికరణ స్వేచ్ఛలో దుస్తులకు చోటు కల్పించకపోవడం బాధాకరమని? మన సమాజం చాలా విచిత్రంగా మారిపోతుందని మరో నెటిజన్ బాధపడ్డాడు.
ఎవరు ఏమనుకుంటున్నప్పటికీ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ సికె కాల్రా మాత్రం తాము ఎవరిపైనా వివక్ష చూపించడం లేదని స్పష్టం చేశాడు. అపార్ట్మెంట్ పరిసరాల్లో కొందరు వదులుగా ఉండే దుస్తులు ధరించి నిత్యం యోగా చేస్తున్నారని, వారి విన్యాసాలు చూడలేక కొంతమంది ఫిర్యాదు చేశారని.. అందుకోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. తొలుత వారికి అర్థమయ్యేలాగే చెప్పామని.. కానీ ఎందుకో వినిపించుకోకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. తమ డ్రెస్సింగ్ కోడ్ నచ్చినవారే ఉండాలని, ఇష్టం లేనివారు నిరభ్యంతరంగా బయటికి వెళ్లిపోవచ్చని ఆయన కుండ బద్దలు కొట్టారు. ఏది ఏమైనప్పటికీ ఒక అపార్ట్మెంట్లో డ్రెస్సింగ్ కోడ్ పెట్టడం, అది సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడం నిజంగా విచిత్రమే.