
Chandrababu: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న తెలుగుదేశం పార్టీ వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉంది. ఈ జోష్ వచ్చే ఎన్నికల్లోనూ ఉంటుందని కేడర్ చెబుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపికి మంచి విజయావకాశాలు ఉన్నాయని టిడిపి క్యాడర్ భావిస్తోంది. అయితే చంద్రబాబు గతంలో మాదిరిగా అభ్యర్థుల ఎంపికను ఆలస్యం చేయకుండా ముందే ప్రకటించాలని, దీనివల్ల అసంతృప్తులను బుజ్జగించేందుకు అవకాశం ఉందని టీడీపి శ్రేణులు చంద్రబాబును కోరుతున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్ కనబడుతోంది. ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉన్నప్పటికీ గతంలో చేసిన పొరపాట్లను చేయకుండా క్షేత్రస్థాయిలో పని చేసుకుంటూ వెళ్లాలని కొందరు తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ బలాన్ని నమ్ముకుని ఎన్నికలకు వెళితే మేలన్న భావనను ముఖ్య నాయకులు వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు అభ్యర్థులను చివరి నిమిషంలో ఖరారు చేశారని, దీనివల్ల అసంతృప్తులను బుజ్జగించడానికి అవకాశం లేకుండా పోయిందని పలువురు నేతలు గుర్తు చేస్తున్నారు.
బుజ్జగింపులతో సత్ఫలితాలు..
రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రెండు నుంచి ఐదు వరకు ఉంది. కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. పరిష్కరించాలంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయడం ద్వారా అసంతృప్తులను బుజ్జగించేందుకు అవకాశం ఉంటుందన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు దక్కని వారు చివరి నిమిషంలో రెబల్ గా పోటీ చేయవచ్చని, అలా కాకుండా ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయాలని, దీనివల్ల టికెట్ రాని అసంతృప్తులను బుజ్జగించేందుకు అవకాశం ఉంటుందని సీనియర్ నేతలు చెబుతున్నారు. కొందరు సీనియర్ నేతలు చంద్రబాబును కలిసి హామీ తీసుకుంటుండగా, కొత్త తరం నేతలు లోకేష్ ను కలిసి టికెట్ విషయంలో హామీ పొందుతున్నారు. తన సహజ స్వభావానికి భిన్నంగా చంద్రబాబు ఏడాది ముందు నుంచే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను అధికారికంగా అక్కడే ప్రకటించారు కూడా. గతంలో చంద్రబాబు ఎప్పుడు ఈ విధంగా వ్యవహరించలేదని, ఇది పార్టీకి సానుకూల అంశంగా పలువురు నేతలు చెబుతున్నారు.
మరోవైపు అభ్యర్థులను ప్రకటిస్తున్న లోకేష్..
ఒకపక్క చంద్రబాబు పలు సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో.. అభ్యర్థులను ఖరారు చేస్తుంటే.. మరో పక్క పాదయాత్ర చేస్తున్న లోకేష్ కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. పాత తరం నేతలు చంద్రబాబు దగ్గర, కొత్త తరం నేతలు లోకేష్ దగ్గర హామీ తీసుకుంటుండడంతో.. తెలుగుదేశం పార్టీలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. టికెట్లకు సంబంధించిన విషయాన్ని ఎవరో ఒకరు స్పష్టంగా ప్రకటన చేస్తే పార్టీ శ్రేణుల్లో ఉన్న గందరగోళం తగ్గుతుందని అభిప్రాయం పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతుంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాల సమాచారం.. చంద్రబాబు ఇప్పటికే 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పచ్చజెండా ఊపారని, వారంతా పనిచేసుకుంటున్నారని చెబుతున్నారు. అయితే అధికారికంగా ప్రకటించకపోవడం వల్ల సొంత పార్టీలోనే ఉండే రెబల్స్ వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. నివారించాలంటే సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.
రెబల్స్ బెడద ఈసారి ఎక్కువే..
గతానికి భిన్నంగా ఈసారి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే టికెట్లను ఆశిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు అనేక జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో టికెట్లను ఆశిస్తున్న వారి సంఖ్య రెండు కంటే ఎక్కువగానే ఉంది. నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కత్తి మీద సాములా మారింది. ఎవరిని ముందుగా ప్రకటిస్తే.. మిగిలిన నాయకులు ఏం చేస్తారన్న ఆందోళన అధిష్టానంలో వ్యక్తం అవుతుంది.

బుజ్జగించే బాధ్యతలు అప్పగించాలి..
నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది. టికెట్టు ఇవ్వాలి అనుకుంటున్నా వ్యక్తికి కన్ఫర్మ్ చేసి… మిగిలిన వారికి ఆ విషయాన్ని ఇప్పుడే చెప్పేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఎన్నికల సమయంలో వారికి ఆ సమయాన్ని చెప్పడం ద్వారా మోసం చేశారు అనే భావన వారిలో కలిగించడం కంటే.. ముందే చెప్పి వారిని బుజ్జగించే బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించాలని పలువురు సూచిస్తున్నారు. టికెట్ల రానివారికి కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్సీ పదవులు ఇస్తామన్న హామీలు ఇచ్చి.. వారు కూడా పార్టీకి పనిచేసేలా చేస్తే తెలుగుదేశం పార్టీ మంచి స్థానాలతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఆ దిశగా అగ్ర నాయకత్వం దృష్టిసారించాలని సూచిస్తున్నారు.