Bengaluru Doctor: అది బెంగళూరు నగరం. మామూలు రోజుల్లోనే ట్రాఫిక్ నరకం చూపిస్తుంది. గంటల తరబడి ఎదురు చూస్తే తప్ప ఇంటికి చేరుకునే పరిస్థితి ఉండదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 10 గంటల దాకా ఈ రోడ్డు చూసినా బారులు తీరిన వాహనాలే కనిపిస్తాయి. మెట్రో, లోకల్ ట్రైన్ లు ఉన్నప్పటికీ కన్నడ వాసులకు ట్రాఫిక్ బాధలు తప్పడం లేదు. కొద్దిరోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు బెంగళూరు రోడ్లు మరింత అద్వానంగా మారాయి. మల్లేశ్వరం, ఎలక్ట్రానిక్ సిటీ, మంగళూరు రోడ్డు.. కు వెళ్ళే మార్గాలయితే మరింత దారుణంగా తయారయ్యాయి. అయితే ఇటువంటి రోడ్డులో ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయిన ఓ డాక్టర్ ఆపరేషన్ బెడ్ పై ఉన్న తన పేషెంట్ కి సర్జరీ చేసేందుకు కారు దిగి చేసిన ప్రయత్నాన్ని ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు.

ఇంతకీ ఏమైందంటే
బెంగళూరు నగరానికి చెందిన ఓ మహిళ గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడడంతో ఇబ్బంది పడుతోంది. ఏళ్లుగా మందులు వాడుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు బెంగళూరులోని మణిపాల్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెకు పరీక్షలు నిర్వహించిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ గోకుల్ నందకుమార్ శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు అందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సరిగ్గా మరుసటి రోజు శస్త్ర చికిత్స గదిలోకి పేషెంట్ ను ఆసుపత్రి వర్గాలు తరలించాయి. ఈ సమాచారాన్ని ఆసుపత్రి సిబ్బంది గోకుల్ నందకుమార్ కు చేరవేశాయి. దీంతో ఆయన తన కారులో ఆసుపత్రికి బయలుదేరారు. మార్గమధ్యంలో ట్రాఫిక్ బాగా జామ్ కావడంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. గత్యంతరం లేక కారుని పక్కకు ఆపి అందులో నుంచి దిగి తన ఫోన్లో తాను ఉన్న ప్రదేశం నుంచి ఆసుపత్రికి ఎంత దూరం ఉందో, ఎన్ని నిమిషాలు ప్రయాణిస్తే చేరుకోవచ్చో గూగుల్ మ్యాప్ ద్వారా చూసుకున్నారు. వెంటనే పరుగు తీయడం ప్రారంభించారు.

మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి 45 నిమిషాలు పరుగు తీసి ఆసుపత్రికి చేరుకున్నారు. పేషెంట్ కు ఆపరేషన్ చేసి సకాలంలో డిశ్చార్జ్ చేశారు. కాగా పేషెంట్ కోసం గోకుల్ నందకుమార్ చూసిన తెగువను పలువురు మెచ్చుకున్నారు. అతడు ఆస్పత్రి వైపు తీస్తున్న పరుగును కొంతమంది ఈ వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాగా బెంగళూరులో రోడ్లు అధ్వానంగా మారడానికి అధికార బిజెపి నాయకులు కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక డాక్టర్ తన పేషెంట్ ను కాపాడుకునేందుకు పరుగు తీశారని, ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలని వారు దుయ్యబడుతున్నారు.