
Dhoni Favorite Food: ప్రపంచ క్రికెట్లో అత్యధిక ఫాలోయింగ్, అభిమానులు కలిగిన క్రికెటర్ లో ముందు వరుసలో ఉంటాడు మహేంద్రసింగ్ ధోని. అటువంటి ధోనీకి సంబంధించిన ఏ విషయమైనా అభిమానులు ఎంతో ఆసక్తికరంగా తెలుసుకుంటారు. ముఖ్యంగా ధోనీకి ఏమంటే ఇష్టం అన్న విషయాలపై అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు అటువంటి ఆసక్తికరమైన అంశమే మీకు చెప్పబోతున్నాం. మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఆహారపు అలవాట్లు గురించి మాజీ క్రికెటర్ ఉతప్ప ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తినే విషయంలో కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించేవాడని తెలిపాడు.
ఫిట్నెస్ కు ధోని ప్రాధాన్యం..
మహేంద్ర సింగ్ ధోని ఫిట్నెస్ కోసం ఎంత కష్టపడతాడో అందరికీ తెలిసిందే. 41 ఏళ్ల వయసులో కూడా ధోని ఫిట్ గా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ కోసం ధోని చపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు ఎప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిట్నెస్ ఉంటేనే క్రికెట్లో ఎక్కువ కాలం మనగలిగేందుకు అవకాశం ఉంది. మహేంద్రసింగ్ ధోని సుదీర్ఘ కాలం పాటు క్రికెట్ ఆడడం వెనక ఆయన ఫిట్నెస్ కారణంగా పలువురు చెబుతుంటారు. ఫిట్టిగా ఉండేందుకు, కనిపించేందుకు ధోని కృష్ణతరమైన వ్యాయామాలు చేయడంతో పాటు తినే ఆహారం విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాడు. నోరూరించే ఆహారం విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటాడు. ఏది పడితే అది తినేందుకు ఆసక్తి చూపించడు. నోటిని కట్టేసుకుంటాడని సహచర క్రికెటర్లే చెబుతుంటారు. తాజాగా మహేందర్ సింగ్ ధోని సహచర క్రికెటర్ ఉతప్ప దోనికి సంబంధించిన ఆహారపు అలవాటు గురించి బయట పెట్టాడు.
బటర్ చికెన్ ధోనీ ఎలా తింటాడు అంటే..
టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఈ మధ్య ఒక మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అందులో ధోని ఆహారపు అలవాట్లు గురించి చెప్పాడు. ధోని బయట హోటల్స్ కి వెళ్లేటప్పుడు బటర్ చికెన్ ఆర్డర్ చేసి దానిని ఎలా తినేవాడో వివరించాడు.
మేమంతా ఒక గ్రూప్..
ఈ సందర్భంగా ఆ మీడియాతో మాట్లాడుతూ ఉతప్ప ఏమన్నాడంటే..
‘రైనా, ఇర్ఫాన్ పఠాన్, ఆర్.పి సింగ్, పియూస్ చావ్లా, మునాఫ్ పటేల్, ధోని, నేను.. మేమంతా ఓ గ్రూప్. అప్పుడప్పుడు అందరం కలిసి హోటల్ కు వెళ్లి తినేవాళ్ళం. దాల్ మఖని, బటర్ చికెన్, జీరా ఆలు, గోబీ, రోటీలు ఆర్డర్ చేసేవాళ్లం. అయితే ధోని మాత్రం తినే విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడు. బటర్ చికెన్ ఆర్డర్ చేసి.. చికెన్ తినకుండా కేవలం గ్రేవీ మాత్రమే తినేవాడు. ఒకవేళ చికెన్ తినాలనుకుంటే రోటీలను పక్కన పెట్టేవాడు. తినే విషయంలో తాను కాస్త విచిత్రంగా ఉండేవాడు’ అని ఉతప్ప వెల్లడించాడు.

మహి భాయ్ వద్దు మహి చాలు..
ఇండియన్ క్రికెట్ లో మహేంద్రసింగ్ ధోని ఒక వెలుగు వెలుగు సంగతి తెలిసిందే. కెప్టెన్ గా ఉన్న సమయంలో అనేక విజయాలను ధోని భారత్ కు అందించాడు. ఇండియన్ క్రికెట్ లో ధోని ఆడుతున్న సమయంలో అతనికి అమితమైన గౌరవాన్ని సహచర క్రికెటర్లు ఇచ్చేవారు. అయితే ఆ గౌరవాన్ని కూడా ధోని వద్దనే వాడని ఈ సందర్భంగా ఉతప్ప వెల్లడించాడు. సహచర ఆటగాళ్లతో ధోని ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడని, తనను మహి అని పిలవాలని, మహీ భాయ్ అని పిలవాల్సిన అవసరం లేదని అనేక సందర్భాల్లో చెప్పిన విషయాన్ని ఉతప్ప ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.