Healthy Brain: మన శరీరంలో ముఖ్యమైన భాగాలలో మెదడు ఒకటి. అవయవాలను క్రమబద్ధీకరించడంలో మెదడు పాత్ర కీలకం. దీంతో మెదడు ఆదేశాలతోనే అన్ని భాగాలు పనిచేస్తాయి. అందుకే మెదడుకు అంతటి విలువ ఉంటుంది. మన బ్రెయిన్ డ్యామేజ్ అయితే మనుగడ ఉండదు. జీవించి ఉన్నా చనిపోయినట్లే లెక్క. దీన్నే బ్రెయిన్ డెడ్ అంటారు. ఇలా మెదడు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మన కణజాలాన్ని కంట్రోల్ చేసే శక్తి కూడా మెదడుకే ఉంటుంది. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి ఉద్ధండ అవయవాలను సరిగా పని చేయించడంలో మెదడు కీలకంగా ఉంటుంది. మెదడు బాగా పనిచేయాలంటే ప్రొటీన్లు ఉన్న ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. తాజా పండ్లు, కూరగాయలు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

మనం తీసుకునే పోషకాహారాలే మన శరీర వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇందుకోసం మనం మంచి ఆహారాలను తీసుకోవడానికి ప్రయత్నించాలి. మెదడు పనితీరు బాగుండాలంటే ప్రొటీన్లు ఉన్న ఆహారాలను తీసుకోవడం తప్పనిసరి. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 65 మిలియన్ల మందిపై చిత్త వైకల్యం ప్రభావం చూపే అవకాశముందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెదడు బాగా పనిచేయాలంటే బలమైన ఆహారాలను తీసుకోవడం మంచిది.
మెదడుకు బలం చేకూర్చే ఆహారాల్లో బెర్రీలు ముఖ్యమైనవి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ వంటి పండ్లను సలాడ్ రూపంలో అల్పాహారంగా తీసుకుంటే శ్రేయస్కరం. ముదురు రంగు పండ్లలో ప్లేవనాయిడ్లు సమృద్ధిగా ఉండటంతో మంటని తగ్గిస్తాయి. మెదడు పనితీరును వేగవంతంగా మారుస్తాయి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాల్లో గుడ్లు కూడా ప్రధానమైనవే. ఇందులో ఉండే కొలిన్, లూటిన్ వంటి పోషకాలు మెదడు బాగా పనిచేసేందుకు సహకరిస్తాయి. ఏకాగ్రత పెరిగేందుకు రోజుకో గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మెదడు పనితీరు బాగుండాలంటే చేపలు కూడా మంచి ఆహారమే. చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండటంతో మెదడు ఆలోచనా శక్తి పెరుగుతుంది. మెదడు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోజువారీ ఆహారంలో చేపలను చేర్చుకోవడం మంచిదే. మెదడుకు ఆరోగ్యాన్ని అందించడంలో నట్స్ కూడా ఉపయోగపడతాయి. మెదడుకు మేలు చేసే ఆహారాల్లో నట్స్ కూడా సూపర్ ఫుడ్ గానే చెబుతారు. నట్స్ తినడం వల్ల మతిమరుపు దూరమవుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

మెదడుకు హాని చేసే ఆహారాల్లో చక్కెర, సోడా, ఎనర్జీ డ్రింక్స్, పండ్ల రసాలు ఉన్నాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే మధుమేహం, గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. చక్కెర పానీయాల వల్ల అల్జీమర్స్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. చిప్స్, స్వీట్లు, ఇన్ స్టంట్ నూడుల్స్, సాస్, రెడీ మేడ్ మీల్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మెదడు ఆరోగ్యాన్ి దెబ్బతీస్తాయి. మద్యం తీసుకునే అలవాటు ఉంటే మానుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.