
CM KCR Kondagattu: ‘నాకంటే పెద్ద హిందువు ఎవలు.. నేను చేసినన్పి పూజలు ఎవరూ చేయరు. ఎవరైనా వస్తే తీర్థం ప్రసాదం ఇచ్చి పంపుతా.. మాంసం తింటన్నమని బొగ్గులు మెడకేసుకొని తిరుగుతమా.. హిందుగాళ్లు బొందుగాళ్లు అని చెప్పుకునేటోళ్ల మాటలనీ బూటకమే.. మతపిచ్చిగాళ్లే.. తెలంగాణ వచ్చినంక దేవాలయాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నం’ ఇవీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పే మాటలు.
‘యాదాద్రి ఆలయాన్ని రూ.1200 కోట్లతో పునర్నిర్మించినం. ఊరికే చేసినమా. ఆలయానికి పెట్టిన పెట్టుబడితో ఇప్పుడు రోజుకు రూ.కోటి ఆదాయం వస్తుంది. యాదాద్రి ఇప్పుడు ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా మారింది’ యాదాద్రి పునర్నిర్మాణంపై తెలంగాణ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పెట్టుబడిదారీ వ్యాఖ్యలు.
తండ్రీ కొడుకుల భిన్న వ్యాఖ్యల నేపథ్యం.. దాదాపు రెండేళ్లుగా కల్వకుంట్ల కవిత వివిధ కార్యక్రమాలతో తరచూ కొండగట్టులో పర్యటిస్తుండడం.. 2021లో రామకోటి స్థూపానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా అఖండ హనుమాన్ చాలీసా పారాయణానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అర్జంట్‌గా కొండగట్టు ఆలయ అభివృద్ధి గుర్తురావడం, వెంటనే బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించడం. ఐదేళ్లల క్రితం వేములవాడకు ఇస్తామన్న హామీ పక్కన పెట్టడం తెలంగాణ హిందూ సమాజంలో కొత్త అనుమానాలకు తావిస్తోంది. అనేక ప్రశ్నలకు తలెత్తుతతున్నాయి. కేసీఆర్ ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ఊరికే చేపట్టరన్న అభిప్రాయం హిందూ సమాజంలో ఉంది. ఈ నేపథ్యంలో కొండగట్టు భూములపై ‘కల్వకుంట్ల’ కుటుంబం కన్ను పడిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
యాదాద్రి అభివృద్ధి నుంచే అనుమానాలు..
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని యాదాద్రిగా చేసేందుకు ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు కేసీఆర్. నాడు చిన్నజీయర్ స్వామితో సన్నిహితంగా ఉన్న కేసీఆర్ ఆయన సూచన మేరకు తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈమేరకు పునర్నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. అయితే అంతా భక్తిభావంతోనే ఆలయ పునర్నిర్మాణం చేశారని అంతా భావించారు. కానీ, యాదాద్రిలో ‘కల్వకుంట్ల’ కుటుంబం రియల్ దందాకు తెరలేపిందని ఆరోపణలు వచ్చాయి. బినామీ పేర్లతో యాదగిరి సమీపంలోని వందల ఎకరాల భూములు కొనుగోలు చేసిన తర్వాత యాదాద్రికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. తర్వాత ఆయన బంధువులు తక్కువ ధరలకు కొన్న భూములను అధిక ధరలకు విక్రయించి కోట్లు గడించారని సమాచారం.
వేములవాడ, ధర్మపురిని ఎందుకు విస్మరించినట్లు..
దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ ఆలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని ఐదేళ్ల క్రితం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున ఐదేళ్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధికి భూమి కావాలని ఆలయాన్ని ఆనుకుని ఉన్న చెరువును పూడ్చివేయించారు. ఆలయం చుట్టూ ఉన్న ఎత్తయిన భవనాలు కూల్చాలని ఆదేశించారు. మాస్టర్ ప్లాన్‌ను కూడా రిలీజ్ చేసి శివభక్తుల్లో ఆశలు రేకెత్తించారు. కానీ తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారు. ఐదేళ్లలో కేవలం రూ.50 కోట్ల పనులు మాత్రమే చేశారు. ఇక ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాన్ని కూడా యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని మూడేళ్ల క్రితం ప్రకటించారు. ఈమేరకు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.50 కోట్ల నిధులు కేటాయించారు. ఆలయం చుట్టూ ఉన్న ఇళ్లను తరలించాలని ఆదేశించారు. కానీ తర్వాత ఆ విషయం మర్చిపోయారు. అయితే వేములవాడ, ధర్మపురి ఆలయాల అభివృద్ధి పనులు అర్ధంతరంగా ఆగిపోవడానికి విపక్షాల నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులు అనేక కారణాలు చెబుతున్నారు. వేములవాడ, ధర్మపురిలో కవ్వకుంట్ల కుటుంబం, బినామీలు కొనుగోలు చేయడానికి, రియల్ దందా చేయడానికి భూముల లేవని, అందుకే ఆలయాల అభివృద్ధిని, గతంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ పక్కన పెట్టారని ఆరోపిస్తున్నారు.

కొండగట్టుకు అందుకే ప్రాధాన్యమా..
తాజాగా సీఎం కేసీఆర్ కొండగట్టు అభివృద్ధిపై దృష్టిపెట్టడానికి అనేక కారణాలు చెబుతున్నారు. కవ్వకుంట్ల కవిత రెండేళ్లుగా కొండగట్టులో పర్యటిస్తోందని, పైకి భక్తిభావం కనిపిస్తున్నా.. ఆమె పర్యటన వెనుక పెద్ద స్కెచ్ ఉండి ఉంటుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆలయం చుట్టూ ఉన్న భూములను బినామీలతో కొనుగోలు చేయించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేదా కొండగట్టు గుట్టలను తవ్వడం ద్వారా ఏదైనా విలువైన సంపద దొరికితే దానిని తరలించుకు పోతారని భావిస్తున్నారు. కాళేశ్వరం కట్టి ఇసుకను అమ్ముకుంటున్నట్లుగా కొండగట్టు గుట్ట రాళ్లలలో విలువైన ఖనిజం ఏదైనా ఉందా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే గతంలో ఎన్నడూ రానంతగా కవిత రెండేళ్లుగా పదేపదే కొండగట్టులో పర్యటిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆరే కొండగట్టుకు వెళ్లి భూములు కొన్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కొండగట్టు వెళ్తే పూజలు చేయడం కోసం అనుకున్నానన్న బండి సంజయ్.. భూములు కొని అభివృద్ధి అంటున్నారని మండిపడ్డారు. కొండగట్టు చుట్టుపక్కల భూములన్నీ త్వరలోనే ఖతం అవుతాయని వ్యాఖ్యానించారు.