Director Harish Shankar: దర్శకుడు హరీష్ శంకర్ ధమాకా మూవీ సక్సెస్ మీట్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. హీరో రవితేజను ఆకాశానికి ఎత్తిన ఈ గబ్బర్ సింగ్ డైరెక్టర్ మాస్ చిత్రాలను తక్కువ చేసి మాట్లాడే వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మేధావులు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిజం కాదు కంటెంట్ ముఖ్యం. డాన్సులు, ఫైట్స్ సినిమాలను కాపాడలేవు. ఓటీటీ యుగంలో మాస్ చిత్రాలకు కాలం చెల్లినట్లే అని మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్లకు చెప్పుతో కొట్టి మరీ సమాధానం చెప్పాము. హీరోయిజం, సాంగ్స్, ఫైట్స్ సినిమాను కాపాడలేవని కామెంట్స్ చేస్తున్నవారికి ధమాకా సక్సెస్ చెంప పెట్టు అని హరీష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అనంతరం రవితేజను ప్రశంసల్లో ముంచెత్తాడు. వేదికపై రవితేజ కాళ్లకు నమస్కారం చేసిన హరీష్ శంకర్… ఆయన లేకపోతే నేను లేనన్నాడు. షాక్ మూవీతో నేను ఫ్లాప్ ఇచ్చినా మరలా నన్ను నమ్మి మిరపకాయ్ మూవీ ఛాన్స్ ఇచ్చారు. ఆ రెండు చిత్రాలు నా జీవితాన్ని మార్చాయి. నా సెకండ్ మూవీ నిర్మాతతో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి ఆగిపోయింది. ఖతర్నాక్ మూవీ షూట్ చేస్తూ చెన్నైలో ఉన్న రవితేజ అన్న నాకు కాల్ చేశాడు. నీ నెక్స్ట్ మూవీ కూడా రవితేజతో ఉంటుందని ఆ నిర్మాతతో చెప్పు. నాకు కథ అవసరం లేదు, నీతో సినిమా చేస్తా అన్నారు. ఆ మాటలు నేనెప్పటికీ మర్చిపోలేనని హరీష్ ఎమోషనల్ అయ్యారు.
నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కూడా ఆయన నన్ను డైరెక్టర్ గానే చూశాడు. అన్నయ్యతో నా ప్రయాణం కొనసాగుతుంది. ఆయన నాలాంటి ఎందరికో లైఫ్ ఇచ్చారని… హరీష్ సుదీర్ఘ ప్రసంగం ఇచ్చారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ధమాకా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. రొటీన్ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. అయితే టాక్ తో సంబంధం లేకుండా ధమాకా మంచి వసూళ్లు రాబట్టింది. ధమాకా రూ. 50 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ క్రాస్ చేసింది.

రవితేజ గత రెండు చిత్రాలు ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ నిరాశపరిచిన నేపథ్యంలో ధమాకా విజయం ఆయనకు కీలకమైంది. కరెక్ట్ టైం లో రవితేజ హిట్ కొట్టాడు. శ్రీలీల ధమాకా మూవీలో హీరోయిన్ గా నటించారు. 2021 లో విడుదలైన క్రాక్ మూవీతో హిట్ కొట్టిన రవితేజ వరుసగా చిత్రాలు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాల్లో నటిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రేణూ దేశాయ్ నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు.