Dil Raju: ఎన్నడూ చూడనంత వివాదం 2023 సంక్రాంతిని చుట్టుముట్టింది. సాధారణంగా సంక్రాంతి సినిమాల విషయంలో ఒక పోటీ వాతావరణం నెలకొంటుంది. ఈసారి ఇద్దరు మెగా ప్రొడ్యూసర్స్ మధ్య ఆధిపత్య పోరు నెలకొందనేది ప్రధాన వాదన. థియేటర్స్ గుప్పెట్లో పెట్టుకొని పరిశ్రమను శాసిస్తున్న దిల్ రాజును కట్టడి చేయాలని మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. తమ బ్యానర్ లో నిర్మించిన రెండు పెద్ద సినిమాలు వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి దిల్ రాజు ప్రమేయం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయాలని చూస్తున్నారు. తనను కాదని మొండిగా వెళుతున్న మైత్రీ మూవీ మేకర్స్ కి తానేమిటో చూపించాలని దిల్ రాజు పక్కా స్కెచ్ వేశాడు.

సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు థియేటర్స్ దొరక్కకుండా దిల్ రాజు చేయనున్నాడు అంటూ… ఒక వాదన తెరపైకి వచ్చింది. టాలీవుడ్ వర్గాల్లో నడుస్తున్న చర్చ ఇది. ఈ క్రమంలో దిల్ రాజు సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. అనేక విషయాలకు ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి విడుదలవుతున్న వారసుడు చిత్రం డబ్బింగ్ మూవీనే అని దిల్ రాజు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను యాంకర్ గుర్తు చేశారు.
2019లో సంక్రాంతికి డబ్బింగ్ చిత్రాలకు థియేటర్స్ ఇవ్వమని చెప్పిన దిల్ రాజు, ఇప్పుడు డబ్బింగ్ మూవీ వారసుడు ఎలా సంక్రాంతి బరిలో నిలుపుతున్నారని ప్రశ్నించారు. దీనికి దిల్ రాజు… 2019లో ఎఫ్ 2, ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ చిత్రాలు విడుదలవుతున్నాయి. వాటికి థియేటర్స్ పంపకం అయిపోయింది. చివరి నిమిషంలో ఒక డబ్బింగ్ మూవీ తీసుకొచ్చి థియేటర్స్ అడిగారు. ఆ పరిస్థితుల్లో ఇవ్వడం కుదరదు అన్నాను. అలాగే 2019 తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఓటీటీకి అలవాటు పడ్డాక, భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు మంచి సినిమాలు ఆదరిస్తున్నారని, అన్నారు.

టాలీవుడ్ టాప్ హీరోలను కాదని విజయ్ తో వారసుడు ఎందుకు చేశారని అడగ్గా… వారసుడు మూవీ మహేష్ బాబుతో అనుకున్నాం. వేరే కమిట్మెంట్స్ తో ఆయనకు కుదరలేదు. తర్వాత రామ్ చరణ్ తో చేద్దాం అనుకున్నాం. అయితే మా బ్యానర్ లోనే ఆయన శంకర్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నారు. అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా ఒక్క స్టార్ హీరో కూడా ఖాళీగా లేరు. అప్పుడు విజయ్ కి స్టోరీ చెబితే అరగంటలో ఓకే చేశారు. అలా వారసుడు విజయ్ తో చేయాల్సి వచ్చిందని, దిల్ రాజు చెప్పుకొచ్చారు.