Brick Biryani: బిర్యాని.. ఎప్పుడో వందల ఏళ్ల క్రితం కనిపెట్టిన ఈ వంటకం మనదైపోయింది. మంచైనా, చెడైనా, వేడుకైనా, ఎలాంటి వేదికైనా.. మన మెనూలో తప్పనిసరి డిష్ గా మారింది. కోడి మాంసం, యాట మాంసం, పీతలు, ఇక కూరగాయలకు అయితే లెక్కలేదు.. అన్ని రకాల్లో బిర్యానీ ఒదిగిపోయింది. మన పొట్టలోకి జారిపోయింది. మన నాలుకను సంతృప్తి పరిచింది. ఒకప్పుడు బిర్యానీ అంటే హైదరాబాద్ మాత్రమే. అందులోనూ ప్యారడైజ్, బావర్చి, షా అండ్ గౌడ్, పిస్తా హౌస్ మాత్రమే.. కానీ బిర్యాని ఇప్పుడు వాటిని మించి ఎదిగిపోయింది. రకరకాల ఫ్లేవర్లలో, రకరకాల వెరైటీలలో అలరించడం మొదలుపెట్టింది.
సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత బిర్యానీ అనేది కేవలం తిండి వస్తువు కాకుండానే కాసుల కురిపించే కామధేనువుగా మారిపోయింది. రకరకాల వెరైటీల్లో లభిస్తూ తిన్నంతవారికి తిన్నంత అనే స్థాయిలో కడుపు నింపుతోంది. అయితే బిర్యానీని సాధారణంగా పెద్ద పెద్ద గిన్నెల్లో వండుతారు. ఇలా కాకుండా కుండలో ట్రై చేస్తే ఎలా ఉంటుందని వచ్చిన ఆలోచనే పాట్ బిర్యాని కి దారి తీసింది. ఇది సూపర్ సక్సెస్ కావడంతో బకెట్ బిర్యానీ పురుడు పోసుకుంది. ఆ తర్వాత స్టీల్ బాక్స్ బిర్యానీ తెరపైకి వచ్చింది. కొంతకాలానికి మగ్ బిర్యానీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇలా ఎన్ని రూపాల్లో వచ్చినప్పటికీ బిర్యానీకి ఉన్న ఆదరణ తగ్గలేదు. ఒక నివేదిక ప్రకారం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు రోజుకు లక్షల్లో బిర్యానీ ఆర్డర్లు వస్తున్నాయంటే ఆ వంటకానికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే తాజాగా హైదరాబాదులో కొంపల్లి ప్రాంతంలో ఔత్సాహికులైన యువత కొత్త ప్రయోగానికి తెరదేశారు. ఇప్పటివరకు ఉన్న బిర్యానీలను తలదన్నే విధంగా కొత్త వెరైటీలకు అంకురార్పణ చేశారు. అదేంటంటే 4 పల్చటి ఇటుకల్లో బిర్యానీ తయారు చేసి వాటిని అమ్మడం ప్రారంభించారు. నిప్పుల మీద నాలుగు పల్చటి ఇటుకలు పెట్టి.. ముందుగానే ప్రిపేర్ చేసిన బిర్యాని బిర్యాని అందులో వేసి..చికెన్, ఉడకబెట్టిన గుడ్లు, మిగతా సుగంధ ద్రవ్యాలు, నెయ్యి వేసి తయారు చేస్తున్నారు. ఆ తర్వాత దానిని భద్రంగా ప్యాక్ చేసి వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. ప్లాస్టిక్ వాటిల్లో అయితే లేనిపోని అనారోగ్యాలు వస్తున్నాయనే భావనతోనే ఇలా బ్రిక్ బిర్యానీకి తెర తీశామని తయారీదారులు చెబుతున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడంతో వినియోగదారులు లొట్టలు వేసుకుంటూ తింటున్నారు. ఇప్పటివరకు రకరకాల బిర్యానీలు టెస్ట్ చేసిన హైదరాబాద్ వాసులకు ఈ బిర్యాని కొత్తగా అనిపించడంతో.. కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ బ్రిక్ బిర్యానీ తయారుదారులు తయారు చేస్తున్న వంటకాన్ని ఒక వీడియో తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram