Mogalturu Chiranjeevi House: మెగాస్టార్ చిరంజీవి దానగుణం అందరికీ తెలిసిందే. స్టార్ హీరోగా ఒక స్థాయికి వచ్చినప్పటి నుండి చిరంజీవి సామాజిక సేవ ప్రారంభించారు. ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేశారు. పరిశ్రమ సమస్యను తన సమస్యగా భావించి పరిష్కారం చూపిస్తారు. అనేక గుప్తదానాలు చేశారు, చేస్తున్నారు. ప్రత్యర్ధులు మాత్రం ఆయన్ని పరోపకారం తెలియనివాడంటూ టార్గెట్ చేస్తూ ఉంటారు. నిరాధార ఆరోపణలు గుప్పిస్తుంటారు. ముఖ్యంగా చిరంజీవిని ఒక విషయంలో ఆడిపోసుకుంటూ ఉంటారు. మొగల్తూరులో ఉన్న చిరంజీవి ఇంటిని గ్రామస్తులు లైబ్రరీ కోసం అడిగితే… ఇవ్వనన్నారట.

కేవలం రూ. 3 లక్షల రూపాయలకు ఆ ఇంటిని అమ్ముకున్నారట. చిరంజీవి పీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు కూడా ఈ పాయింట్ ని ప్రత్యర్థి పార్టీలు హైలెట్ చేశాయి. ఈ అపవాదుకు చిరంజీవి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అసలు జరిగిన విషయం ఏమిటో చెప్పుకొచ్చారు. చిరంజీవి మాట్లాడుతూ… మొగల్తూరులో ఉన్న ఇల్లు నాది కాదు. అది మా మామయ్యది. నాది మొగల్తూరు కాదు. నాన్నగారి ఊరు పెనుగొండ. అమ్మది నెల్లూరు జిల్లా. మా తాత గారు ట్రాన్స్ఫర్ మీద మొగల్తూరు వెళ్లారు.
నేను అక్కడే పుట్టాను. మొగల్తూరులో ఉన్న ఆ ఇల్లు మా మామయ్య శ్రీనివాసరావుది. ఆయన బ్యాంకు ఎంప్లొయ్. తన అవసరానికేదో ఇల్లు అమ్ముకున్నాడు. అక్కడి నుండి వెళ్లిపోయారు. తర్వాత అమ్మమ్మ వాళ్ళు నా దగ్గరకు చెన్నై వచ్చేశారు. తర్వాత హైదరాబాద్ కి రావడం జరిగింది. వాళ్ళ బాధ్యత నేను తీసుకున్నాను. అక్కడ జరిగింది అది. నిజానికి అంతకు ముందే నేను మొగల్తూరులో లైబ్రరీ కట్టించాను. ఇవ్వన్నీ నిరాధార ఆరోపణలు.. అంటూ కొట్టిపారేశారు.

మొగల్తూరులో తాను పుట్టి పెరిగిన ఇల్లు తనది కాదని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. ఆ ఇల్లు అమ్మినమాట వాస్తవమే కానీ… అది నేను కాదు. మామయ్య ఆస్తి ఆయన అమ్ముకున్నారని చిరంజీవి ఇన్నేళ్లుగా ఉన్న ఆరోపణలకు సమాధానం చెప్పారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ సమయంలో ఎంపీ నిధులతో మొగల్తూరు గ్రామంలో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. ఇవేమీ తెలియని యాంటీ ఫ్యాన్స్… కొందరు ఉద్దేశపూర్వకంగా పుట్టించిన పుకార్లను నమ్మి చిరంజీవిపై మాటల దాడి చేస్తుంటారు.