Homeక్రీడలుIndia vs Sri Lanka: ధోని ఫార్ములా : టీమిండియా ప్రక్షాళన.. టీ20 టీంలో ఇక...

India vs Sri Lanka: ధోని ఫార్ములా : టీమిండియా ప్రక్షాళన.. టీ20 టీంలో ఇక సీనియర్లకు నోచాన్స్‌!!

India vs Sri Lanka: భారత క్రికెట్‌లో చాలా రోజుల తర్వాత మార్పు కనిస్తోంది. క్రికెటర్ల ఎంపిక విషయంలో సెలక్టర్లు.. వెటరన్‌ క్రికెటర్లకు కాకుండా యువకులకు పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభమైన 2007లో కూడా యువకులకే బీసీసీఐ ప్రాధాన్యం ఇచ్చింది. నాడు సీనియర్‌ క్రికెటర్లుగా ఉన్న సచిన్, ద్రవిడ్, గంగూలీ ని సెలక్టర్లు పక్కన పెట్టారు. దీంతో సీనియర్లు లేకుండా ప్రపంచకప్‌కు వెళ్లింది టీమ్‌ఇండియా. అప్పుడు ఈ సీనియర్లపై వేటు వేసినట్లు ప్రకటనేమీ రాలేదు. కానీ వాళ్లు తర్వాత మళ్లీ ఎప్పుడూ టీ20ల్లో కనిపించలేదు. ధోని సారథ్యంలో ఎక్కువగా కుర్రాళ్లతో నిండిన జట్టు ప్రపంచకప్‌ గెలిచి సంచలనం సృష్టించింది. ఇప్పుడు మళ్లీ భారత టీ20 జట్టులో సీనియర్లను పక్కన పెట్టి కుర్రాళ్లకే పెద్ద పీట వేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. హార్ధిక్‌ పాండ్య నేతృత్వంలో శ్రీలంక సిరీస్‌కు ప్రకటించిన టీ20 జట్టును చూస్తే ఈ విషయం అర్థమైతుంది.

India vs Sri Lanka
hardik pandya, rohit sharma

అంచనాలు అందుకోలేకపోయిన రోహిత్‌…
విరాట్‌ కోహ్లి టీ20 కెప్టెన్‌గా తప్పుకున్నాక ఎన్నో అంచనాల మధ్య జట్టు పగ్గాలు అందుకున్నాడు రోహిత్‌ శర్మ. అతడి సారథ్యంలో అయినా జట్టు ప్రపంచకప్‌ గెలుస్తుందేమో అనుకుంటే.. మళ్లీ వైఫల్యం తప్పలేదు. ప్రపంచకప్‌ కంటే ముందు ఆసియా కప్‌లో కనీసం ఫైనల్‌ అయినా చేరకుండా నిష్క్రమించినపుడే జట్టు మీద అంచనాలు తగ్గిపోయాయి. ఇక ప్రపంచకప్‌లో సూపర్‌–12 వరకు బాగానే ఆడినా.. సెమీస్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర పరాభవంతో ఇంటిముఖం పట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది భారత్‌. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ పనితనంపై అనేక ప్రశ్నలు రేకెత్తాయి. మరోవైపు ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ చాలా రోజుల నుంచి పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. కోహ్లి ఆ టోర్నీ వరకు బాగానే ఆడినా.. మునుపటి జోరు తగ్గినా అతడిని టీ20ల్లో కొనసాగించడం సరైందేనా అన్న ప్రశ్నలు తలెత్తాయి. మరోవైపు అంతకంతకూ ప్రదర్శన పడిపోతుండడంతో భువనేశ్వర్‌పై వేటు వేయాల్సిందే అన్న డిమాండ్లు మరింత పెరిగాయి. ఈ నలుగురూ శ్రీలంకతో సిరీస్‌కు జట్టులో లేరు. వీరితోపాటు నిలకడ లేమితో సతమతం అవుతున్న పంత్‌ కూడా వన్డే, టీ20 జట్లకు దూరమయ్యాడు. పంత్‌ వయసు తక్కువే కాబట్టి పునరాగమనానికి చాన్స్‌ ఉంది. కానీ మిగతా నలుగురూ మాత్రం మళ్లీ టీ20 జట్టులో ఆడేది అనుమానమే.

నలుగురిదీ 30 ప్లస్‌ వయసే..
శ్రీలంక టీం నుంచి సెలక్టర్లు తప్పించిన నలుగురు సీనియర్ల 30 ఏళ్లు పైపడినవారే. ఫామ్‌ పరంగా చూస్తే రోహిత్‌ (35 ఏళ్లు), కోహ్లి (34 ఏళ్లు) కెరీర్‌ చరమాంకానికి చేరువ అవుతున్నట్లే. ఇంకో రెండేళ్లకు జరిగే టీ20 ప్రపంచకప్‌లో వీళ్లు ఆడే అవకాశాలు ఎంతమాత్రం లేదు. అందుకే ఈ ఇద్దరూ స్వచ్ఛందంగా టీ20లకు దూరమైనట్లుగా కనిపిస్తోంది. రాహుల్‌కు 30 ఏళ్లే అయినా.. అతడిని టీ20 జట్టులో కొనసాగిస్తుండడంపై తీవ్ర విమర్శలు వస్తుండడంతో సెలక్టర్లు పక్కన పెట్టినట్లున్నారు. 32 ఏళ్ల భువనేశ్వర్‌కు 2022 టీ20 ప్రపంచకప్‌ను చివరి అవకాశంగా భావించారు. అందులో అతను విఫలమవడంతో దాదాపుగా కెరీర్‌ ముగిసినట్లే కనిపిస్తోంది. కోహ్లి, రోహిత్, రాహుల్‌ దృష్టి వచ్చే ఏడాది చివర్లో సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌ మీదే ఉన్నట్లుంది. ఈ ముగ్గురూ లంకతో వన్డేలకు జట్టులోకి ఎంపికవడం గమనార్హం.

India vs Sri Lanka
hardik pandya rohit sharma

హార్ధిక్‌.. మరో ధోనీ అవుతాడా?
2007లో హఠాత్తుగా టీ20 జట్టు సారథ్యం చేపట్టి.. ఆ వెంటనే ప్రపంచకప్‌ గెలిపించి ప్రపంచ మేటి కెప్టెన్లలో ఒకడిగా ఎదిగిపోయాడు ధోని. ఇప్పుడు హార్ధిక్‌ను ధోనీతో పోల్చుకుంటున్నారు అభిమానులు. ఏడాది ముందు వరకు హార్ధిక్‌లో కెప్టెన్‌ ఉన్నాడన్న సంగతి ఎవరూ గుర్తించలేదు. కానీ ఐపీఎల్‌లోకి కొత్తగా అడుగు పెట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ జట్టును గొప్పగా నడిపించి కప్పు గెలిపించి తన నాయకత్వ లక్షణాలను చాటుకున్నాడు. ఆ తర్వాతే టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ కూడా అతడిని నమ్మడం మొదలుపెట్టింది. ఇప్పటికే కొన్ని మ్యాచ్‌ల్లో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించి హార్ధిక్‌ సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు టీ20లకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జట్టుకు యువ రక్తం ఎక్కించి అతడికి అప్పగించారు సెలక్టర్లు. వయసులో పెద్దవాడైనా అంతర్జాతీయ అనుభవంలో జూనియర్‌ అయిన సూర్యకుమార్‌ టీ20 జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. బ్యాటింగ్‌లో ఇషాన్, రుతురాజ్, శాంసన్, శుభ్‌మన్, త్రిపాఠి, హుడా.. బౌలింగ్‌లో అర్ష్‌దీప్, ఉమ్రాన్‌ మాలిక్, సుందర్‌.. ఇలా ఎటు చూసినా జట్టులోప్రస్తుతం కుర్రాళ్లే కనిపిస్తున్నారు. గాయం నుంచి కోలుకుని వస్తే బుమ్రా బౌలింగ్‌ బలాన్ని పెంచుతాడు. అతడికి తోడు చాహల్, అక్షర్‌ పటేల్‌ లాంటి కొందరు టీ20 జట్టులో కొనసాగనున్నారు.

మొత్తంగా కుర్రాల్లను ఏకతాటిపై నడిపి, వారి నుంచి ఉత్తమ ప్రదర్శనను రాబట్టుకుని, జట్టు తత్వం పెంచి 2024 టీ20 ప్రపంచకప్‌ దిశగా హార్ధిక్‌ ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరం.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular