https://oktelugu.com/

Warangal: ఉద్యోగం ఇచ్చిన బ్యాంకుకే టోకరా..8.67 కోట్లు నొక్కేసిన డిప్యూటీ మేనేజర్

త్వరగా డబ్బులు సంపాదించాలనే దురాశతో.. తనకు ఉద్యోగం ఇచ్చిన బ్యాంకుకే 8.65 కోట్ల మేర టోకరా పెట్టాడు ఆ బ్యాంకు డిప్యూటీ మేనేజర్.

Written By:
  • Rocky
  • , Updated On : September 13, 2023 11:30 am
    Warangal

    Warangal

    Follow us on

    Warangal: తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదే కాబోలు. తనకు ఉద్యోగం ఇచ్చి, డిప్యూటీ మేనేజర్ హోదా ఇచ్చి, రకరకాల సౌకర్యాలు కల్పించిన బ్యాంకుకు టోకరా వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఏకంగా కోట్ల రూపాయల నోక్కేశాడు. బ్యాంకు అధికారుల అంతర్గత విచారణలో అతగాడి దోపిడీపర్వం కళ్ళకు కట్టడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫలితంగా ఆ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ కటకటాల పాలయ్యాడు. ఘటన తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

    త్వరగా డబ్బులు సంపాదించాలనే దురాశతో.. తనకు ఉద్యోగం ఇచ్చిన బ్యాంకుకే 8.65 కోట్ల మేర టోకరా పెట్టాడు ఆ బ్యాంకు డిప్యూటీ మేనేజర్. ఆ డబ్బులు మొత్తం క్రికెట్, ఆన్ లైన్ బెట్టింగ్లో పెట్టాడు. అంతా పోగొట్టుకొని చివరికి జైలు పాలయ్యాడు. వరంగల్ లోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన బైరిశెట్టి కార్తీక్ నర్సంపేట లోని ఐసిఐసిఐ బ్యాంకులో గోల్డ్ సెక్షన్ (రెన్యువల్, క్లోజింగ్) విభాగంలో డిప్యూటీ మేనేజర్ గా 2019 నుంచి పనిచేస్తున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని అత్యాశ ఉన్న కార్తీక్ అందుకు తన హోదాను వాడుకున్నాడు. బంగారం తనఖా పెట్టి రుణాలు తీసుకున్న వారు.. అరుణాని పూర్తిగా తీర్చేందుకు వచ్చినప్పుడు పిక్ ఆ డబ్బులను తీసుకొని వాడుకోవడం మొదలుపెట్టాడు. రుణ ఖాతాను క్లోజ్ చేయకుండా, బంగారు ఆభరణాలను ఖాతాదారుడికి ఇచ్చేసి.. ఎవరికి అనుమానం రాకుండా ఖాతా రెన్యూవల్ డబ్బులను తానే చెల్లించేవాడు. తద్వారా ఆ ఖాతా కొనసాగుతున్నట్టు బ్యాంకు రికార్డుల్లో చూపించేవాడు. అలా సంపాదించిన డబ్బు నుంచి కొంత మొత్తాన్ని రుణాల రెన్యువల్ కు వాడుకొని.. మిగిలిన డబ్బులతో క్రికెట్ బెట్టింగ్, ఆన్ లైన్ గేమ్స్ ఆడేవాడు. కొన్నిసార్లు బ్యాంకు ఖజానాలో ఉన్న బంగారు పౌచ్ (ఆభరణాలను భద్రపరిచే కవర్) లను తీసుకొని వేరే వ్యక్తుల పేరు మీద ఖాతా తెరిచి తద్వారా వచ్చిన డబ్బులను క్రికెట్ బెట్టింగ్ కు వాడుకునేవాడు.

    అనధికారికంగా ఖాతాలు తెరవడం, ఖాతాదారుడి అనుమతి లేకుండా బంగారు పౌచ్ లను తెరవడం, వేరే వారి పేరు మీద అదే బంగారం పెట్టి రుణం పొందడం.. ఇలా రకరకాలుగా బ్యాంకు ను మోసం చేశాడు. కొన్ని సందర్భాల్లో గోల్డ్ పౌచ్ ల్లో నకిలీ బంగారు ఆభరణాలు పెట్టి కస్టోడియన్, ఆడిటర్ సంతకాలు ఫోర్జరీ చేసి అకౌంట్ క్లోజ్ చేసినట్టు చూపించేవాడు. మూడున్నర సంవత్సరాలలో బ్యాంకు అధికారులకు అనుమానం రాకుండా 128 మంది ఖాతాల ద్వారా 8,65,78,953 సొంతానికి వాడుకున్నాడు. ఆన్ లైన్ బెట్టింగ్ లో పెట్టిన డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు. ఆగస్టులో బ్యాంక్ అధికారుల అంతర్గత ఆడిటింగ్ లో కార్తీక్ చేసిన మోసాలు మొత్తం బయటపడ్డాయి. దీంతో పోలీసులకు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు. మంగళవారం అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఈ కేసులో బ్యాంకు అధికారుల పాత్ర పై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. అయితే కార్తీక్ మోసాల వల్ల బ్యాంకు ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవని వారు భరోసా ఇచ్చారు. కాగా, కార్తీక్ ఉదంతంతో ఐసిఐసిఐ బ్యాంకులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.