
MLC Elections- YCP: ఏపీలో అధికార పార్టీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్పీ ఎన్నికల్లో పోటీ నువ్వానేనా అన్నరీతిలో ఉంది. అయితే తూర్పు రాయసీలమ ఉపాధ్యాయ స్థానంలో మాత్రం వైసీపీ విజయం సాధించింది. ఇది కాస్తా ఉపశమనం కలిగించే విషయం. కానీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో మాత్రం టీడీపీ ముందంజంలో ఉంది. విజయానికి కూత వేటు దూరంలో నిలిచింది. తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానంలో సైతం టీడీపీ స్పష్టమైన ఆధిక్యతను కొనసాగిస్తూ వస్తోంది. పశ్చిమ రాయలసీమ స్థానంలో మాత్రం వైసీపీకి స్వల్ప ఆధికత్య ఉంది. అక్కడ రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు అనివార్యంగా మారింది. పీడీఎఫ్ తో ఉన్న పరస్పర అవగాహనతో అక్కడ గట్టెక్కుతామని టీడీపీ భావిస్తోంది. అయితే ఓవరాల్ ట్రెండ్స్ చూస్తుంటే మాత్రం ఒక్క తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ స్థానం తప్పించి మిగతా చోట్ల అధికార పార్టీకి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానాన్ని వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మూడు రాజధానుల అంశంతో పాటు విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాగైనా విజయం సాధించి విపక్షాలకు గట్టి సవాల్ విసరాలని ప్రయత్నించింది. కానీ ఇక్కడ టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు భారీ ఆధిక్యత దిశగా కొనసాగుతుండడం అధికార పార్టీకి మింగుడుపడడం లేదు. టీడీపీలో మాత్రం జోష్ నెలకొంది. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాలను చూస్తే..49,512 ఓట్లతో 46.13 శాతంతో టీడీపీ ముందంజలో ఉంది. వైసీపీ రెండోస్థానంలో నిలిచింది. 31,281 ఓట్లతో 29.14 శాతం దక్కించుకుంది. పీడీఎఫ్ అభ్యర్థి 18,110 ఓట్లు, బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి 5,193 ఓట్లు మాత్రమే సాధించారు. మొత్తానికి టీడీపీ అభ్యర్థి విజయానికి దగ్గరగా ఉండడంతో ఆ పార్టీలో సంబరాలు మిన్నంటాయి. తుది ఫలితం కొద్ది గంటల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఫలితంతో విశాఖ కేంద్రంగా జరుగుతున్న రాజకీయం కొత్త సమీకరణాలకు దారితీసే చాన్స్ కనిపిస్తోంది.
తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ స్థానంలో వైసీపీ అభ్యర్థి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించారు. రాయలసీమలోని రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తూర్పు సీటులో టీడీపీ ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తోంది. మూడో రౌండ్ ముగిసే సమయానికి టీడీపీ అభ్యర్థి 49, 173 ఓట్లు, వైసీపీ అభ్యర్థి 39, 615 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి 16,250 ఓట్లు సాధించారు. ఇక్కడ గెలుపునకు 55,166 ఓట్లు అవసరం. మరో రౌండ్ పూర్తయితే తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. ఇక్కడ తొలి ప్రాధాన్యం ఓటుతోనే గట్టెక్కుతామని టీడీపీ ఆశాభావంతో ఉంది. లేకుంటే రెండో ప్రాధాన్యత ఓట్లతో తప్పకుండా గెలుపొందుతామని ఆశాభావంతో ఉంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో వైసీపీ స్వల్ప ఆధిక్యతతో కొనసాగుతోంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి 28,872 ఓట్లురాగా.. టీడీపీ అభ్యర్థికి 26,929 ఓట్లు వచ్చాయి. పీడీఎఫ్ అభ్యర్థి 5 వేల ఓట్లకుపైగా సాధించారు. ఇక్కడ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పీడీఎఫ్ తో ఉన్న అవగాహనతో విజయం తమనే వరిస్తుందని టీడీపీ నమ్మకంగా ఉంది.

వచ్చే ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ఎమ్మెల్సీల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రజల మూడ్ ను తెలుసుకునేందుకు శాంపిల్స్ గా భావించాయి. అయితే ఉపాధ్యాయ స్థానంలో వైసీపీ బోణి కొట్టగా ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానాలు టీడీపీ ఖాతాలో పడే చాన్స్ కనిపిస్తోంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానం మాత్రం నువ్వానేనా అన్నరేంజ్ లో నడుస్తోంది. అయితే జగన్ కు బలమున్న రాయలసీమలో మాత్రం ట్రెండ్స్ మారుతుండడం అధికార పార్టీని కలవరపరుస్తోంది. గత ఎన్నికల తరువాత రాష్ట్రస్థాయి విజయం దక్కని టీడీపీకి మాత్రం ఈ ఎన్నికలు కలిసి వచ్చినట్టే కనిపిస్తున్నాయి.