Dammaiguda School Girl Missing Incident: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ అబేద్కర్ నగర్‌లో జరిగిన బాలిక ఇందు(10) అనుమానాస్పద మృతిపై ఐదు రోజులుగా కొనసాగుతున్న మిస్టరీ వీడింది. బాలిక ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందు మృతిపై అనుమానాలు లేవని శవపరీక్ష నివేదికలో వైద్యులు వెల్లడించినట్లు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు చెరువులో జారిపడటంతో ఊపిరితిత్తుల్లోకి నీరు చేరినట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

బడికి వెళ్లి.. చెరువులో శవమై..
ఈనెల 15న పాఠశాలకెళ్లి అదృశ్యమైన బాలిక అనుమానాస్పదస్థితిలో చెరువులో మృతదేహంగా కనిపించడం కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ పరిధి ఎన్టీఆర్‌నగర్‌కాలనీలో పాత సామగ్రి సేకరిస్తూ ఉపాధి పొందే జీడల నరేష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. ముగ్గురు దమ్మాయిగూడలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. గురువారం ఉదయం చిన్న కుమార్తె ఇందు(10), కుమారుడి(12)ని తండ్రి నరేష్ తన ద్విచక్రవాహనంపై పాఠశాలకు తీసుకెళ్లాడు. పని ఉందంటూ పిల్లలిద్దరిని మధ్యలో దింపి నడిచి వెళ్లమని చెప్పారు. వారు నడుచుకుంటూ బడికెళ్లారు. కొద్దిసేపటి తర్వాత పుస్తకం మరిచిపోయాను తెచ్చుకుంటానని ఇందు ఒంటరిగా పాఠశాల నుంచి బయటికెళ్లింది. హాజరు తీసుకుంటున్న ఉపాధ్యాయుడు విద్యార్థిని రాలేదని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. తల్లిదండ్రులు 100కు సమాచారం ఇచ్చారు.
మిస్సింగ్‌తో ఆందోళన..
గురువారం సాయంత్రం వరకూ ఎదురుచూసినా బాలిక ఆచూకీ తెలియలేదు. పోలీసులు రాత్రి 7.30 గంటల సమయంలో డాగ్‌స్క్వాడ్‌తో గాలింపు చేపట్టగా.. పాఠశాల నుంచి దమ్మాయిగూడ చెరువు వరకూ వెళ్లాయి. సీసీఫుటేజీలు పరిశీలించగా.. బాలిక గురువారం ఉదయం 9.23 గంటల సమయంలో పాఠశాల సమీపం నుంచి ఒంటరిగా వెళ్తున్నట్లు ఉంది. మరిన్ని ఫుటేజీల్లో.. దమ్మాయిగూడ చెరువు మార్గంలో బాలిక పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్లు గుర్తించారు. శుక్రవారం చెరువులో చిన్నారి శవమై తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు విచారణను కొనసాగించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి వైద్యులు.. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతోనే బాలిక ఇందు మృతిచెందినట్లు నివేదికలో పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు.

టాయిలెట్ కోసమే అటు..
సాధారణంగా పాఠశాలలో చిన్నారులంతా టాయిలెట్ కోసం చెరువు వైపు వెళ్తుంటారు. పుస్తకం కోసం ఇంటికి బయల్దేరిన ఇందుకు టాయిలెట్ రావడంతో చెరువువైపు పరిగెత్తింది. టాయిలెట్ తర్వాత చెరువులో దిగిన చిన్నారి అదుపు తప్పి అందులో పడిపోయింది. ఆ సమయంలో ఎవరూ గమనించకపోవడంతో నీటిలో మునిగి మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు.