
ఈ మధ్య కాలంలో ప్యాకెట్ పాల వినియోగం దేశవ్యాప్తంగా పెరుగుతోంది. పల్లెలతో పోలిస్తే పట్టణాల్లోనే ప్యాకెట్ పాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా..? అనే ప్రశ్నకు మాత్రం ఆ పాలు స్వచ్చమైనవి కాదని కొన్నిసార్లు ఆ పాలు తాగితే కొత్త ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చని తాజాగా జరిగిన ఒక ఘటనతో నిరూపితమవుతోంది. ఒక వ్యక్తి ఏకంగా డెయిరీలోని పాలలో స్నానం చేశాడు.
అయితే ఈ ఘటన జరిగింది మన దేశంలో కాదులెండి. టర్కీలోని కొన్యాలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను చేసిన పని వల్ల పోలీసులు అతనిని అరెస్ట్ చేయడంతో పాటు ఆ డెయిరీ సంస్థనే మూసివేశారు. అతడు స్నానం చేసిన పాలు జనాలకు సరఫరా చేసే పాలు కావడంతో అధికారులు అతనిపై సీరియస్ కావడంతో పాటు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
ఇందులో విచిత్రం ఏమిటంటే స్నానం చేసిన వ్యక్తే ఆ వీడియోను తీసుకుని తన సన్నిహితులకు పంపించాడు. దీంతో తన అరెస్ట్ కు పరోక్షంగా ఆ వ్యక్తే కారణమయ్యాడు. ఇలా ప్రజలు వాడే పాలను స్నానానికి వినియోగించిన వ్యక్తి పేరు ఉగర్ తుత్గాత్. ఈ ఘటన గురించి ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం సీరియస్ అయ్యారు. కోర్టు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది.
ఒక వ్యక్తి వల్ల డెయిరీలో పని చేసే ఇతర వ్యక్తులు సైతం ఉద్యోగులు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు అతనిని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.