
కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్లలో భారీ సంఖ్యలో కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కాగా ఏపీలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడంపై గతంలో ప్రతిపక్షాల నుంచి సైతం విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పలు జిల్లాల్లో గత కొన్ని రోజుల నుంచి డబుల్ డిజిట్ లో కేసులు నమోదవుతున్నాయి.
మొదట్లో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదైన కర్నూలు జిల్లాలో గత 24 గంటల్లో కేవలం 37 కేసులు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,367 కరోనా కేసులు నమోదు కాగా అదే సమయంలొ 2,747 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,40,738 కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం 21,434 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి ఇప్పటివరకు 6,779 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీ కేసులు పెరుగుతుండటం, కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతో మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేసుల సంఖ్య తగ్గినా ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు.
ఇకపోతే రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే గోదావరి జిల్లాలపై వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు రెండు లక్షల కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో కేసుల సంఖ్య ఇదే విధంగా తగ్గితే మరికొన్ని రోజుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.