Asha Parekh: బాలీవుడ్ దిగ్గజ నటి అశా పారేఖ్‌ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది. సినిమా రంగంలో అత్యుత్తమ పురస్కారం ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్’ 2020 సంవత్సరానికిగాను ఆశా పారేఖ్కే కేంద్రం ప్రకటించింది. ఈమేరకు కేంద్ర సమాచారం, ప్రసార శాఖ మంత్రి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుకను సెప్టెంబర్ 30న నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 30న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజ్ఞాన్ భవన్లో 79 ఏళ్ల ఆశా పరేఖ్‌కి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఆశా నటిగానే కాక దర్శకురాలిగా, నిర్మాతగానూ తనదైన ముద్ర వేశారు. సినిమా రంగానికి ఆశ చేసిన సేవలకు 1992లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీరంగ ప్రవేశం..
ఆశ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీరంగ ప్రవేశం చేశారు. 1952లో ఓ కార్యక్రమంలో స్టేజ్ పై డాన్స్ చేస్తున్న పదేళ్ల ఆశాను చూసిన ప్రముఖ డైరెక్టర్ బిమల్ రాయ్.. ఆమెను మా సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నచించినప్పటికీ అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కొన్నేళ్లపాటు ఇండస్రీకి దూరంగా ఉన్న ఆశ చదువు పూర్తిచేశారు. పదహారేళ్ల వయసులో హీరోయిన్గా తెరంగేట్రం చేశారు. డైరెక్టర్ నాసిర్ హుస్సేన్ తెరకెక్కించిన దిల్ దేకే దేఖో(1959)లో షమ్మీకపూర్ సరసన కథానాయికగా నటించింది. ఈ సినిమా తర్వాత ఆశాపరేఖ్ వెనుదిరిగి చూడాల్సి రాలేదు. జబ్ ప్యార్ కిసీ సే హోతా హై(1961), ఫిర్ వహీ దిల్ లయా హూన్(1963), తీస్రీ మంజిల్(1966), బహరోన్ కే సప్నే(1967), ప్యార్ కా మౌసమ్(1969), కార్వాన్(1971) మంజిల్ చిత్రాలలో నటించి మెప్పించారు. నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆశా పరేఖ్.
గుజరాతీ, పంజాబీ, కన్నడ చిత్రాల్లోనూ..
ఆశ పరేఖ్ గుజరాతీ, పంజాబీ, కన్నడ చిత్రాల్లో నటించారు. 1970, 1980 దశకాల్లో ఆమె ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి బుల్లితెరపై గుజరాతీలో జ్యోతి(1990) సీరియల్‌కు దర్శకత్వం వహించారు. అలాగే పలాష్ కే ఫూల్, బాజే పాయల్, కోరా కాగజ్, దాల్ మే కాలా వంటి షోలను నిర్వహించారు.
దాదాసాహెబ్ అందుకున్నది వీరే..
సినిమా రంగంలో అత్యుత్తమ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కేను ఇప్పటివరకు బాలీవుడ్ నటులు రాజ్‌కపూర్, యశ్ చోప్రా, లతా మంగేష్కర్, మృణాల్ సేన్, అమితాబ్ బచ్చన్, వినోద్ ఖాన్నా అందుకున్నారు. మొదట ఈ అవార్డును దేవికా రాణి అందుకోగా.. గతేడాది సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ అందుకున్నారు.
ఆశా జర్నీ స్ఫూర్తిదాయకం
బాలీవుడ్ నటి ఆశా పరేఖ్ నట జీవితం ఇప్పుడొస్తున్న నూతన తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె జీవితం నుంచి తెలుసుకోవాల్సి అంశాలు చాలా ఉన్నాయి.
1959 నుంచి 73 వరకు బాలీవుడ్ అగ్ర నటిగా రాణించారు ఆశా పరేఖ్. అత్యంత విజయవంతమైన నటిగా, బాలీవుడ్‌ను చాలా వరకు ప్రభావితం చేసిన కథానాయికగా పేరు తెచ్చుకున్న ఆశాపరేఖ్ జీవితం ఆధారంగా రాసిన ‘ది హిట్ గర్ల్’ పుస్తకాన్ని బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ విడుదల చేశారు.

– ‘గూంజ్ ఉతి షేహనై’ చిత్రంలో మొదటగా ఆశా పరేఖ్‌ను నటిగా తీసుకున్నారు. రెండు రోజులు షూటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత ఆమె సదరు పాత్రకు కరెక్ట్ కాదని అర్థంతరంగా తీసేశారట.
– ఆశా పరేఖ్ హిందీ చిత్ర పరిశ్రమ యొక్క స్వర్ణయుగంలో తన వరుస హిట్లతో బాలీవుడ్ యొక్క “జూబ్లీ గర్ల్” అనే పేరును సంపాదించుకుంది.
– 1960లు మరియు 1970లలో దాదాపు 20 రజత మరియు బంగారు జూబ్లీ హిట్లలో నటించిన ఈ నటి తన భావావేశపూరితమైన కళ్లతో, అప్రయత్నమైన నటనతో మనోహరమైన నృత్యంతో చిత్రనిర్మాతలకు మరియు ప్రేక్షకులకు నీలికళ్ల అమ్మాయిగా మారింది.
– వేదికపై ఆమె చేసిన అసంఖ్యాక డ్యాన్స్ బ్యాలెట్లు ఆమెకు స్వదేశంలో మరియు విదేశాలలో చెప్పుకోదగ్గ ప్రశంసలను సంపాదించాయి. ఆమె ఇతర అంశాలలో, ఆమె ఒక స్వచ్ఛంద ఆసుపత్రిని నిర్వహించడంలో దశాబ్దాలుగా నిమగ్నమై ఉంది.
– ఆమె సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఛైర్పర్సన్ (1998-2001) మరియు సినీ మరియు టీవీ ఆర్టిస్టుల అసోసియేషన్లు మరియు చిత్ర పరిశ్రమ కార్మికులు, సాంకేతిక నిపుణులు మరియు నటీనటుల సంక్షేమానికి అంకితమైన ఇతర సంస్థలతో అనుబంధం కలిగి ఉంది.
– ఆశా పరేఖ్ హెయిర్ స్టైల్ చాలా ప్రత్యేకం.. పొడవారి జుత్తుకు కూడా నాడు అభిమానులు ఉండేవారు. ఆమె వేసుకునే కొప్పు మరింత ప్రత్యేకం. ఆకొప్పుతో ఆశా ముఖానికి మరింత అందం వచ్చేది. తెలుగులో వాణిశ్రీ కూడా హీరోయిన్గా ఇలాంటి కొప్పు వేసుకునేవారు.
లవ్ ఫెయిల్యూర్‌తో పెళ్లికి దూరం..
79 ఏళ్ల ఆశా పరేఖ్ తెరపై తన అందాలతో కోట్లాది మంది హృదయాలను దోచుకున్నారు. కానీ, నిజ జీవితంలో ఒంటరి. ఆమె లవ్ ఫెయిల్యూర్ కారణంగానే వివాహం చేసుకోలేదని అంటూ అంటారు. అప్పట్లో జరిగిన ప్రచారం మేరకు ఆశా పరేఖ్ ఆ రోజుల్లో ప్రముఖ దర్శకుడు నాసిర్ హుస్సేన్‌తో రిలేషన్ ఉన్నారు. కానీ నాసిర్‌కు అప్పటికే పెళ్లయింది. అందుకే వారి సంబంధం తరువాతి దశకు వెళ్లలేక పోయింది. ఆశా నాసిర్ హుస్సేన్‌తో ఎంతగా ప్రేమలో ఉందంటే ఆమె ఆయనని తప్ప మరొకరిని తన జీవితంలో ఊహించుకోలేక జీవితాంతం ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకుంది.
Also Read: Minister Roja- Dasara Vaibhavam Event: సన్మానం అంటూ పిలిచి రోజాకు అవమానం..!