
దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మన దేశంతో పాటు ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది. ఇలాంటి సమయంలో ఈ నెల 11వ తేదీన రష్యా తొలి వ్యాక్సిన్ ను విడుదల చేసింది. అయితే తాజాగా రష్యా విడుదల చేసిన కరోనా వ్యాక్సిన్ గురించి సంచలన ప్రకటన చేసింది. ఆ దేశ ఆరోగ్య నిపుణులు 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లకు మాత్రమే ఈ వ్యాక్సిన్ ను ఇవ్వాలని తెలిపారు.
60 సంవత్సరాల వయస్సు పై బడిన వారికి, 18 సంవత్సరాల లోపు వారికి వ్యాక్సిన్ కు సంబంధించి మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని అందువల్ల అనంతరం ఈ వ్యాక్సిన్ ను వాళ్లకు ఇవ్వాలో వద్దో సూచిస్తామని రష్యా చెబుతోంది. ఇప్పటికే 18 నుంచి 60 ఏళ్ల వయస్సు మధ్య వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం, వ్యాక్సిన్ మంచి ఫలితాలు సాధించడం జరిగింది. కాబట్టి వైద్యులు వీరికి మాత్రమే వ్యాక్సిన్ ను ఇవ్వాలని సూచిస్తున్నారు.
మరోవైపు కరోనా వ్యాక్సిన్ తొలి బ్యాచ్ మరో 14 రోజుల్లో సిద్ధం కానుందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ తెలిపారు. డాక్టర్లతో పాటు ప్రజలకు వాలంటరీ పద్ధతిన వ్యాక్సిన్ ను ఇవ్వనున్నామని చెప్పారు. రష్యా కరోనా వ్యాక్సిన్ కు తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ మాత్రమే నిర్వహించింది. రష్యా స్పుట్నిక్ వి అనే పేరును ఈ వ్యాక్సిన్ ను నామకరణం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని వారిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని రష్యా చెబుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీల ఉత్పత్తితో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని రష్యా పేర్కొంది.