
కరోనా సెకెండ్ వేవ్ వచ్చినా సినిమా వాళ్ళు లక్షలు ఎందుకు దానం చెయ్యరు ? హీరోయిన్లు అసలు ఎప్పుడూ డబ్బులు డోనేట్ చెయ్యరా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారు. మరీ హీరోయిన్లు ఎందుకు విరాళాలు ప్రకటించడం లేదు అని అడగడం చూసిందేమో గానీ, మొత్తానికి పూజా హెగ్డే సేవ మొదలెట్టింది.
కరోనా సంక్షోభం వల్ల ఇబ్బంది పడుతోన్న పేదవారికి సాయం చేయడానికి ముందుకు వచ్చింది ‘పూజా హెగ్డే’. కర్నాటకలో ప్రస్తుతం లాక్ డౌన్ ఉంది కాబట్టి, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు జనం. అలాంటి పేద కుటుంబాలకి అండగా నిలవడానికి, దాదాపు వంద కుటుంబాలను ఎంచుకుంది పూజా. ఆ కుటుంబాలకు నెలకు సరిపడా సరుకుల్ని అందించింది.
పైగా సరుకులతో పాటు కరోనా కిట్ లను కూడా అందించి తన ఉదారతని ఘనంగా చాటుకుంది ఈ టాల్ బ్యూటీ. సాయం చేయడంతో పాటు వాటన్నింటిని తనే స్వయంగా ప్యాక్ చేసింది. మరి ఇంత చేశాక పబ్లిసిటీ లేకపోతే ఏమి బాగుంటుంది అనుకుందేమో.. మొత్తానికి తానూ ప్యాక్ చేస్తోన్న సమయంలో ఫోటోలు తీయించుకుంది.
పైగా ఆ ఫోటోలను తన టీమ్ తో సోషల్ మీడియాలో బాగా ప్రమోషన్స్ ను చేయించుకుంది. ప్రస్తుతం పూజా హెల్ప్ కి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు పూజా హెగ్డే పై ప్రశంసల వర్షం కురిపిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నట్టు కరోనా బారిన పడిన పూజా బ్యూటీ ఇటీవల కోలుకుంది.