Nagababu- Minister Roja: బీజేపీతో కలిసే ఉన్నాం. ప్రభుత్వం పై ప్రతిపక్షాలు కలిసి పోరాడాలి. జనసేన బలం ఏపీలో పెరిగింది. మంత్రి రోజా గురించి మాట్లాడటం తమ స్థాయిని తగ్గించుకోవడమే “ ఇవి అనంతపురంలో జనసేన నేత నాగబాబు చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

అనంతపురంలో జనసేన నేతలతో సమావేశమైన నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వారాహి యాత్ర, పొత్తుల గురించిన ప్రకటన పవన్ కళ్యాణ్ చేస్తారని తెలిపారు. ఏపీలో జనసేన బలం పెరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో బీజేపీతో కలిసే ఉన్నామని మరో ప్రకటన చేశారు. దీంతో ఏపీ వ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. ఒకవైపు జనసేన, టీడీపీ పొత్తు ఖాయమని చర్చ నడుస్తోంది. మరోవైపు బీజేపీ టీడీపీతో కలిసి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీతో కలిసే ఉన్నాం అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు మరింత వేడిని పుట్టించాయి. జనసేన, టీడీపీ.. బీజేపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నా బీజేపీ కలిసి వస్తుందా ? అన్న అనుమానం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
పొత్తుల గురించిన ప్రకటన పవన్ కళ్యాణ్ చేస్తారని నాగబాబు చెబుతున్నారు. మార్చి తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీ పర్యటన ఉంటుందని అన్నారు. మంత్రి రోజా ఇటీవల చేసిన వ్యాఖ్యల పై నాగబాబు తనదైన శైలిలో స్పందించారు. మంత్రి రోజా గురించి మాట్లాడి తమ స్థాయిని తగ్గించుకోలేమని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ లేదని, వైసీపీగా ఎప్పుడో మారిపోయిందని అన్నారు. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని, ప్రతిపక్షాలను అడ్డుకోవడం కోసమే జీవో నెంబర్ 1 తీసుకొచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల పై పోరాటానికి ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని నాగబాబు కోరారు.

బీజేపీని కలుపుకుపోవడానికి జనసేన ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ బీజేపీ నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు కనిపించడంలేదు. జనసేనతో వెళ్లాడానికి ఇబ్బంది లేకపోయినా టీడీపీతో వెళ్లడానికి ఆలోచిస్తోంది. సొంతంగా ఎదిగే ఆలోచన ఉన్న బీజేపీ ఎంతమేరకు జనసేన, టీడీపీతో కలిసి వస్తుందో వేచి చూడాలి. జనసేన మాత్రం ప్రతిపక్షాల ఐక్యత గురించి స్పష్టమైన వైఖరిని తీసుకుంది.