
ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. ప్రతిరోజూ అంచనాలకు అందని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. శాస్త్రవేత్తల అధ్యయనాల్లో ఈ వైరస్ కు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో శాస్త్రవేత్తల పరిశోధనల్లో కరోనా వైరస్ లలో 60 రకాలు ఉన్నాయని… ఈ వైరస్ లు వాతావరణ పరిస్థితులను బట్టి తమ రూపురేఖలను మార్చుకుంటాయని తేలింది.
తాజాగా మలేషియా శాస్త్రవేత్తలు అలా రూపాంతరం చెందిన కరోనా వైరస్ ను కనిపెట్టారు. భారత్ కు వెళ్లి మలేషియాకు తిరిగొచ్చిన వ్యక్తిలో రూపాంతరం చెందిన వైరస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆయన నుంచి మరికొందరికి వైరస్ సోకింది. అయితే శాస్త్రవేత్తలు ఆ వ్యక్తికి సోకిన రూపాంతరం చెందిన వైరస్ చాలా ప్రమాదకరమని… 10 రెట్లు వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతుందని తేల్చారు. రూపాంతరం చెందిన వైరస్ లను వ్యాక్సిన్లు చంపగలవో లేదో చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ రూపాంతరం చెందిన వైరస్ కు d614g అనే పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. అమెరికా, యూరప్ లలో రూపాంతరం చెందిన వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని మలేషియా హెల్త్ జనరల్ డైరెక్టర్ నూర్ హిషమ్ అబ్ధుల్లా తెలిపారు. ప్రజల సహకారం లేనిదే కరోనాను కట్టడి చేయలేమని… ప్రజలు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.